కరీంనగర్, వెలుగు: జనగణనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ‘మన జనాభా గణన– - మన అభివృద్ధి' అనే నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభా గణన దేశంలో అతిపెద్ద ప్రజల భాగస్వామ్య కార్యక్రమమని, ప్రతి ఇంటి సమాచారం నమోదు చేసుకోవడం అందరి బాధ్యతని స్పష్టం చేశారు.
తొలి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా, గణన చేపడతారని వివరించారు. దీనికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేయాలని సూచించారు. దీనికోసం(se.census.gov.in) వెబ్‌సైట్‌లో స్వీయ గణన ఐడీ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాందత్తా రెడ్డి, జిల్లా సెన్సస్ అధికారి తిరుపతి పాల్గొన్నారు.

