కార్మికుల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి. అన్ని రంగాల కార్మికులకు అండగా ఉంటామన్నారు. 2026 మే 01వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. కార్మికులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్లకకు భద్రత కల్పిస్తున్నామని అన్నారు. గిగ్ వర్కర్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం మంచి పరిణామం అన్నారు. 4 లక్షల గిగ్ వర్కర్లకు మేలు జరగనున్నట్లు తెలిపారు. కార్మికుల విషయంలో యాజమాన్యాల దృక్పథం మారుతుందన్నారు. కార్మికుల భద్రత కోసం యాజమాన్యాలు మరింత కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో కార్మికులకు మెళకువలు నేర్పిస్తామని తెలిపారు.
యువతకు స్కి్ల్స్ పెంచి.. ఉపాధి కల్పించేందుకు ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకుని ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 120 ఏటీసిల్లో రూ.4 వేల కోట్లతో ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఏటీసీ సెంటర్లలో స్టూడెంట్స్ కు రూ.2500 స్కాలర్ షిప్స్ ఇస్తున్నామన్నారు. అగ్రికల్చర్ రంగాన్ని కూడా కోర్సుల్లో చేర్చినట్లు చెప్పారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం టామ్ కామ్ కు సీఎం రేవంత్ 90 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. యువతకు జర్మన్ భాష నేర్పిస్తున్నట్లు చెప్పారు. యువతలో స్కి్ల్స్ పెంచేందుకు ఏటీసీ సెంటర్ల ఏర్పాటు
కార్మిక రంగంలో ఉన్నవారికి ఈఎస్ఐ సదుపాయం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. శంషాబాద్, రామగుండంలో 100 బెడ్స్ హాస్పిటల్స్, మహబూబ్ నగర్ లో 30 బెడ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల కోసం పీజేఆర్ పేరుతో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చే ఏడాది నుంచి ప్రకటిస్తామని తెలిపారు. కార్మికుల పక్షాన పీజేఆర్ నిలబడ్డారని గుర్తు చేశారు. కార్మికుల కోసం మల్టీస్పెషలిటీ హాస్పిటల్ పెట్టాలని డిమాండ్ వస్తోందని.. ఆ దిశగా కూడా ఆలోచన చేస్తామన్నారు.
రవీంద్ర భారతిలో జరిగిన మే డే వేడుకల్లో మంత్రి వివేక్ తో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, లేబర్ కమిషనర్ సత్పతి పమేల, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కమిషనర్ దాసరి హరిచందన, లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్, కార్పొరేటర్ విజయరెడ్డి , రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
