తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కడతాం.. శంకుస్థాపనకు నేనే వస్తా: సీఎం రేవంత్

తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కడతాం.. శంకుస్థాపనకు నేనే వస్తా: సీఎం రేవంత్

హైదరాబాద్: తుమ్మిడిహెట్టి దగ్గర గోదావరి నదిపై ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 153 మీటర్ల ఎత్తులో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామని.. ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసేందుకు తానే వస్తానని అన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని కానీ కేసీఆర్ ఈ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారని విమర్శించారు. 

ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఊరు.. పేరు మార్చి కాళేశ్వరం కట్టారని.. మూడేళ్లలో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయ్యిందని అన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న అక్రమ సొమ్ము కోసం కేసీఆర్ సొంత పిల్లలే కొట్టుకుంటున్నారని.. కూతురో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కో పొట్లాడుకుంటున్నారన్నారు. కుటుంబ కలహాలతోనే కేసీఆర్ మూలకు పడ్డాడని అన్నారు.

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం (డిసెంబర్ 4) సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా‎లో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆదిలాబాద్‎లో సిమెంట్ కంపెనీ ప్రారంభిస్తామని అన్నారు. 
ఆదిలాబాద్‎లో అపారమైన సున్నపు రాయి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్‎కు యూనివర్శిటీ ఇచ్చే బాధ్యత నాదని.. ఎక్కడో కట్టాలో స్థానిక నేతలు చర్చించుకుని రావాలని సూచించారు. ఇంద్రవెళ్లిలో యూనివర్శిటీ కడితే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చనాకా కొరట ప్రాజెక్టును త్వరలోనే జాతికి అంకిస్తాం చేస్తామని తెలిపారు. 

ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తున్నామని.. ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ  పీసీసీ అధ్యక్షుడిగా తన తొలి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే జరిగిందని.. తొలి బహిరంగ సభ ఇంద్రవెళ్లిలోనే జరిగిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇంద్రవెళ్లి అమరవీరుల స్మారక స్థూపాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దామని.. అలాగే ఇంద్రవెళ్లి అమరవీరులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు.

సవాల్‎తోనే రాష్ట్రంలో వెనకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని.. త్వరలోనే మరోసారి ఆదిలాబాద్ కు వచ్చి జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేస్తానని తెలిపారు.  పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టొదని.. ఎన్నికల్లో ఖర్చు పెట్టినంతా కూడా ఆదాయం రాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసేటోన్ని గెలిపించాలని.. బాతకానికొట్టేటోని కాదని పిలుపునిచ్చారు.