వారం రోజుల్లో వడ్లన్నీ కొంటం: చెన్నూరు రైతులకు మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ

వారం రోజుల్లో వడ్లన్నీ కొంటం: చెన్నూరు రైతులకు మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ
  • గోదాములు కిరాయికి తీసుకున్నం
  • అదనంగా 75 లారీల కేటాయించినట్టు వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని రైతుల నుంచి ప్రతిగింజ కొంటామని మంత్రి వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసేందుకు చర్యలు స్పీడప్ చేసినట్టు చెప్పారు.

సోమవారం ఆయన నియోజకవర్గ రైతులనుద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గంలో ఈ సారి అంచనాలకు మించి వరి దిగుబడి వచ్చిందన్నారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ధాన్యం నిల్వ చేసేందుకు చెన్నూరు, పెద్దపల్లిలో గోదాములు కిరాయికి తీసుకున్నామని, హమాలీల సంఖ్యను కూడా పెంచామని చెప్పారు. ధాన్యం తరలించేందుకు అదనంగా 75 లారీలను ఏర్పాటు చేశామన్నారు.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్​ దీపక్, అధికారులు కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. వారం రోజుల్లోగా మద్దతు ధరతో రైతుల వద్ద ఉన్న ధాన్యం మొత్తాన్ని కొంటామని భరోసా కల్పించారు.