ఢిల్లీ కోట బద్దలు కొడ్త

ఢిల్లీ కోట బద్దలు కొడ్త

జాతీయ రాజకీయాల్లో అడుగుపెడ్త: కేసీఆర్​
బీజేపీ బిడ్డల్లారా.. నశం నశం చేస్తం
నేను హైదరాబాద్‍లో పేపర్లల్ల చూసిన. నర్మెట్ట, జనగామ టౌన్‍లో ఎవడో పిడికెడులేని బీజేపోడు టీఆర్‍ఎస్‍ కార్యకర్తలను కొట్టిండని వచ్చింది. బీజేపీ బిడ్డల్లారా..మేం మంచివాళ్లం. ఎవ్వరినీ ఏమనం. కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తం జాగ్రత్త. మేం ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతరు జాగ్రత్త.. మీ ఉడుత బెదిరింపులకు ఎవడూ భయపడేవాడు లేడు.
నా కొట్లాట గులగుల పెట్టి కాదు
నా కొట్లాట గులగుల పెట్టి కాదు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా ఇయ్యరు. కాజీపేట రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ ఇయ్యుమంటే ఇయ్యరు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇయ్యుమంటే ఇయ్యరు. మోడీ.. నువ్వు ఇయ్యకున్నా మంచిదే.. రేపు రేపు మేం చూస్కుంటం.. ఈ దేశం నుంచి నిన్ను తరిమేస్తం.. మాకిచ్చెటోన్ని తీసుకొస్తం. అంతమందం తెలివి మాకున్నది.

జనగామ, వెలుగు: జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి ఢిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం కేసీఆర్‍ ప్రకటించారు. మోడీని దేశం నుంచి తరిమేస్తామని హెచ్చరించారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్​ బిల్డింగ్​, టీఆర్​ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్​ను ఆయన ఓపెన్​ చేశారు. అనంతరం పార్టీ ఆఫీస్​ సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్​ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘జాగ్రత్త నరేంద్ర మోడీ.. ఇది తెలంగాణ.. ఇది  పులిబిడ్డ. మీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేవాడెవ్వడు లేడు” అంటూ హెచ్చరించారు. ‘‘దేశం గురించి కొట్లడుదమా? జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించుదమా?.. కచ్చితంగా.. కడదాకా.. కడదాకా..’’ అని సభలోని వారిని అడిగి సమాధానాలు రాబట్టారు. ‘‘సిద్దిపేట నుంచి పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసినం.. రాష్ట్రాన్ని సాధించుకున్నం.. ఇయ్యాల మీరంతా దీవించి బయలుదేరు అంటే  ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్న. కొట్లాడ్త’’ అని కేసీఆర్​ చెప్పారు. 
తిరగబడ్తం.. 
కేంద్రం సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేయబోమని కేసీఆర్‍ అన్నారు. ‘‘మోడీ.. మా ప్రాణం పోయినా కరెంటు బాయిలకు  మీటర్లు పెట్టం. తిరగబడ్తం.. కొట్లాడ్తం.. అవసరమైతే ఢిల్లీ దాకా వస్తం. కానీ కరెంట్‍ మీటర్లు పెట్టం. నువ్వు ఏం చేస్తవో చేస్కోపో.. నీ సంస్కరణలు మేం అమలు చేయం’’ అని సవాల్​ చేశారు. ‘‘నరేంద్రమోడీ రైతులు, పేదల ఎంబడి పడ్డడు. డీజిల్​, గ్యాస్‍, ఎరువులు, వస్తువులు అన్ని ధరలు పెంచిండు’’ అని ఆయన ఆరోపించారు. 
రైతుల ఇన్కమ్​ డబుల్​ జేస్తా అన్న ప్రధాని రైతుల పెట్టుబడులు డబుల్​ చేశారని కేసీఆర్​ దుయ్యబట్టారు. లక్షల కోట్లు కుంభకోణాలు చేసినోళ్లకు టికెట్లు కొనిచ్చి లండన్​ పంపించారని, విజయ్​ మాల్యా, నీరవ్‍ మోడీలు అట్లనే వెళ్లారని ఆరోపించారు. ‘‘కరెంట్‍ సంస్కరణల పేరుతో మోడీ ప్రతి మోటార్‍కు మీటర్‍ పెట్టాలే అన్నడు. నన్ను చంపినా పెట్ట.. అని చెప్పిన. అప్పట్లో చంద్రబాబు కూడా బాయికో మీటర్‍ పెట్టాలే అన్నడు. నాకు కోపమొచ్చి బాయికెందుకురా భయ్‍. మనిషికో మీటర్‍ పెట్టు.. అందరం కలిసి నీకు మీటర్‍ పెడ్తం..మాకు పీడ పోతదని చెప్పిన. ఈరోజు ఆయన పోయిండు. మనం మంచిగున్నం’’ అని కేసీఆర్​ అన్నారు.  రాష్ట్రంలో ఒక్కో పథకాన్ని ఓ ప్లాన్​ ప్రకారం అమలు చేసుకుంటూ పద్ధతిగా పోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకొని చెరువులు నింపుకోవడంతో పంటలు పండుతున్నాయని, గ్రామాలు మంచిగైనయని, వ్యవసాయ భూముల ధరలు పెరిగాయని, గతంలో లక్షన్నర పలికిన భూములు ఇప్పుడు రూ. 30 లక్షలు,  కొన్ని చోట్ల కోట్లు పలుకుతున్నాయని తెలిపారు. 
జనగామకు మెడికల్‍ కాలేజీ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు విజ్ఞప్తి మేరకు జనగామ జిల్లాకు మెడికల్‍ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో జీవో ఇష్యూ చేస్తామన్నారు. పాలకుర్తి, స్టేషన్‍ ఘన్​పూర్‍లో డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జనగామలో కరెంట్‍ బాధ, మంచినీటి బాధ పోయిందని, కొంత సాగునీటి సమస్య ఉందని, ఏడాదిలోగా ఆ ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాలు, చెరువులు నింపే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పజెప్తున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ సభలో రాష్ర్ట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాథోడ్​, ప్రశాంత్​ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వరంగల్​లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మార్చి తర్వాత నియోజకవర్గానికి 
2 వేల మందికి దళితబంధు
‘‘తెలంగాణ వస్తేనే బాగు పడతామని చెప్పిన. వందకు వంద శాతం అదే జరుగుతున్నది. దళితులు బాగుపడాలని దళితబంధు తీసుకొచ్చిన’’ అని కేసీఆర్​ అన్నారు. ‘‘ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తం. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల కుటుంబాలకు స్కీం అమలు చేయాల్సి ఉంది. మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గానికి రెండు వేల మందికి ఇస్తం. ఇప్పటికే మెడికల్‍, ఫర్టిలైజర్‍, హాస్టల్‍, హాస్పిటల్‍ సామాను సప్లయ్​, బార్‍ షాప్‍, వైన్‍ షాపుల్లో కూడా  రిజర్వేషన్‍ పెట్టినం. దళితులకు ఈ రకంగా అవకాశాలు దేశంలో ఎక్కడ లేవు’’ అని చెప్పారు. త్వరలో నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు.