
టీఎస్పీఎస్సీ చైర్మెన్ ఘంటా చక్రపాణి
ఆరేండ్లలో 35,724 పోస్టులు భర్తీ చేసినం
ఆరో ఏడాది రిపోర్టు రిలీజ్ చేసిన గవర్నర్
హైదరాబాద్, వెలుగు: ఆరేండ్లలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా 35,724 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. వీటిలో 31,052 పోస్టుల వివరాలు సర్కారుకు పంపించామనీ, 4672 పోస్టులకు వివరాలను పంపించాల్సి ఉందన్నారు. భర్తీ చేసిన వాటిలో అత్యధికంగా దాదాపు 20వేల టీచర్ పోస్టులు ఉన్నట్లు చెప్పారు. గురువారం ఆయన, టీఎస్పీఎస్సీ సెక్రెటరీ వాణీ ప్రసాద్, సభ్యులు సి.విఠల్, బి.చంద్రావతి, మతీనుద్దీన్‌ఖాద్రీ, కృష్ణారెడ్డి, సాయిలు తదితరులతో కలిసి వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ 2019–20 ఏడాది రిపోర్టును గవర్నర్ రిలీజ్ చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ఆరేండ్లలో 39,952 పోస్టుల భర్తీకి సర్కారు టీఎస్పీఎస్సీకి అనుమతి ఇచ్చిందని చెప్పారు. వాటిలో 36,758 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామనీ, వీటిలో 35,724 పోస్టుల భర్తీ పూర్తయిందని చెప్పారు. మరో 115 పోస్టులకు సంబంధించి ప్రాసెస్ నడుస్తోందన్నారు. 919 పోస్టులు కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. రిక్రూట్మెంట్ క్యాలెండర్తాము ఇవ్వమనీ, సర్కారు ఇస్తే అమలు చేస్తామన్నారు.