పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా..కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా..కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం
  •     ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్‌‌బాగ్, వెలుగు: పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ బషీర్‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, సి.రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అని, గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని కులగణనను చేపడుతున్నారని కొనియాడారు. మోదీ నాయకత్వంలోనే బీసీ బిల్లును సాధించుకోవాలని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లతో పాటు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు వంటి డిమాండ్లపై ఈ నెల 30, 31 తేదీల్లో ఢిల్లీలో ఓబీసీల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ సదస్సుకు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు హాజరవుతారని తెలిపారు. ప్రధాని మోదీని ఒప్పించి బీసీల డిమాండ్లను సాధించుకునే ప్రయత్నం చేస్తామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ సత్యం, పగిళ్ల సతీశ్​ తదితరులు పాల్గొన్నారు.