ఆర్టీసీ JAC నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంచేయబోతుంది?

ఆర్టీసీ JAC నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంచేయబోతుంది?

ఆర్టీసి సమ్మెపై ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసింది. ఇవాళ(శనివారం) సాయంత్రం ఆరు గంటల లోపు రిపోర్ట్ చేసిన వారిని మాత్రమే ఉద్యోగులుగా గుర్తిస్తామని యాజమాన్యం విధించిన గడువు దాటిపోయింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరు కూడా రిపోర్ట్ చేయలేదు. అంతేకాదు వచ్చే రెండు రోజులకు చేపట్టనున్న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను TSRTC జేఏసీ ప్రకటించింది.

సమ్మెకు సంబంధించిన అంశంపై జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడారు.రేపు(ఆదివారం) అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇస్తామన్నారు. ఉదయం 11 గంటలకు ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, సాయంత్రం 5 గంటలకు అన్ని డిపోల దగ్గర కార్మికుల కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆటపాట నిర్వహిస్తామన్నారు. అలాగే ఎల్లుండి(సోమవారం) ఉదయం 8 గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పిస్తామని, తర్వాత ఇందిరాపార్క్ దగ్గర నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.

ప్రయాణికులకు అసౌకర్యం కల్పించడం జేఏసీ ఉద్దేశం కాదన్న అశ్వత్థామరెడ్డి… సెప్టెంబర్ లోనే సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. దసరా పండగ వచ్చే వరకు ప్రభుత్వం తమతో చర్చలు జరపకపోగా, యూనియన్లపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకూ తమ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విధులకు హాజరుకాని కార్మికులను తొలగించాలంటే, మొట్టమొదట తనను ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు.

మరోవైపు డెడ్ లైన్ ముగిసినా కార్మికుల నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేట్ బస్సులను రంగంలోకి దింపనున్నారు.