కరోనా టైమ్​లో బిలియనీర్ల సంపద డబుల్

కరోనా టైమ్​లో బిలియనీర్ల సంపద డబుల్
  • ఆక్స్‌‌ఫామ్‌‌ రిపోర్టు టాప్ 10 బిలియనీర్ల సంపదతో 
  • 25 ఏండ్లు ఫ్రీ ఎడ్యుకేషన్‌ ఇవ్వొచ్చు
  • 142 మంది దగ్గర రూ.53.2 లక్షల కోట్లు
  • ఇది కేంద్ర బడ్జెట్‌‌ కంటే 41 శాతం ఎక్కువ

న్యూఢిల్లీ: ధనవంతులు మరింత ధనవంతులుగా ఎదుగుతున్నరు.. కరోనా టైమ్‌‌లోనూ ఇది మారలేదు. పైగా కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. వరల్డ్‌‌ ఎకనమిక్‌‌ ఫోరమ్‌‌ (ఆన్‌‌లైన్‌‌) ‘దావోస్‌‌ ఎజెండా సమ్మిట్‌‌’ సందర్భంగా సోమవారం రిలీజ్ చేసిన రిపోర్టులో ఇదే విషయాన్ని వెల్లడించింది ఆక్స్‌‌ఫామ్‌‌. ఇండియాలోని అత్యంత ధనవంతులపై ఒక శాతం ట్యాక్స్ వేసినా చాలా మార్పులు తీసుకురావొచ్చని పేర్కొంది. టాప్‌‌ 10 బిలియనీర్ల సంపదతో 25 ఏళ్లపాటు  దేశంలోని స్కూళ్లకు ఫండ్స్ ఇవ్వొచ్చని, పిల్లలందరికీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉచితంగా అందించవచ్చని చెప్పింది. దేశంలోని హెల్త్‌‌, ఎడ్యుకేషన్ సెక్టార్లను మెరుగుపరిచేందుకు అత్యంత ధనవంతులైన 10 శాతం మందిపై ఒక శాతం ట్యాక్స్ వేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.

కొత్తగా 40 మంది..
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం మొదలై రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో దిగువ మధ్యతరగతి, పేదల ఆదాయాలు తగ్గిపోయాయి. కానీ బిలియనీర్ల సంపద మాత్రం రెండింతల కన్నా ఎక్కువే పెరిగిందని ఆక్స్‌‌ఫామ్ రిపోర్ట్ పేర్కొంది. 


కిందటేడాది దేశంలో బిలియనీర్ల సంఖ్య మరో 39 శాతం (40 మంది బిలియనీర్లు) పెరిగిందని, ఇప్పుడు 142కి చేరుకుందని వివరించింది. 2020 మార్చి నుంచి 2021 నవంబర్ దాకా వీరి సంపద 23.1 లక్షల కోట్ల (313 బిలియన్ డాలర్లు) నుంచి 53.2 లక్షల కోట్ల (719 బిలియన్ డాలర్లు)కు పెరిగిందని చెప్పింది. అదే టాప్‌‌‌‌ 98 బిలియనీర్ల సంపద ఏకంగా 55.5 కోట్ల మంది పేదవారి సంపద (రూ.49 లక్షల కోట్లు)తో సమానమని వెల్లడించింది. మరోవైపు గ్లోబల్‌‌‌‌గా చూసినా కరోనా టైమ్‌‌‌‌లో ధనవంతులు, పేదవారి మధ్య అంతరం పెరిగిందని పేర్కొంది. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 16 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారని వివరించింది. ఇందులో 2020లో 4.6 కోట్ల మంది ఇండియన్లు తీవ్రమైన పేదరికంలో కూరుకుపోయారు.
 

హెల్త్‌‌‌‌ నుంచి ఎకనమిక్ క్రైసిస్‌‌‌‌గా..

దేశంలో టాప్‌‌‌‌ 10 మంది ధనవంతులు రోజుకి 10 లక్షల డాలర్లు (రూ.7.4 కోట్లు) ఖర్చు చేసినా.. వారి సంపద మొత్తం ఖర్చయిపోవడానికి 84 ఏళ్లు పడుతుందని ఆక్స్‌‌‌‌ఫామ్‌‌‌‌ అంచనా వేసింది. ధనవంతులు, మహా ధనవంతులపై ఏడాదికి ఒక శాతం వెల్త్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ వేస్తే ఏడాదికి 78.3 బిలియన్ డాలర్ల (రూ.5.8 లక్షల కోట్లు) రెవెన్యూని ప్రభుత్వం సేకరించవచ్చని, ఈ రెవెన్యూతో హెల్త్‌‌‌‌పై ప్రభుత్వం చేస్తున్న బడ్జెట్ కేటాయింపులు ఏకంగా 271 శాతం పెరుగుతాయని పేర్కొంది. ఇంకా మరో 30.5 బిలియన్ డాలర్లు మిగులుతాయని వివరించింది. కరోనా సంక్షోభం హెల్త్ క్రైసిస్‌‌‌‌గా మొదలైనా.. ప్రస్తుతం ఎకనమిక్ క్రైసిస్‌‌‌‌గా మారుతోందని ఆక్స్‌‌‌‌ఫామ్‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ సంపదలో 45 శాతం వాటా టాప్ 10 శాతం మంది ధనవంతుల దగ్గరే ఉందని, జనాభాలో 50‌‌‌‌‌‌‌‌ శాతంగా ఉన్న దిగువ మధ్యతరగతి, పేద వారి దగ్గర కేవలం 6 శాతం సంపద ఉందని వెల్లడించింది. హెల్త్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌,  సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న ఫండ్స్‌‌‌‌.. ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న ఖర్చులకు సరితూగడం లేదని అభిప్రాయపడింది. దీంతో కరోనా హెల్త్ ప్రాబ్లమ్స్‌‌‌‌ నుంచి రికవర్ అవ్వడంలో కామన్ మ్యాన్‌‌‌‌కు తిప్పలు తప్పడం లేదని పేర్కొంది.
 

డబ్బున్నోళ్లపై ‘సర్‌‌‌‌‌‌‌‌చార్జ్’ వేయండి

రెవెన్యూ వచ్చే సోర్స్‌‌‌‌లను ప్రభుత్వం పెంచుకోవాలని, ట్యాక్స్‌‌‌‌లు వేయడంలో మెరుగైన విధానాలను తీసుకురావాలని ఆక్స్‌‌‌‌ఫామ్‌‌‌‌ సూచించింది. హెల్త్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌, సోషల్ సెక్యూరిటీ వంటి అంశాలను యూనివర్సల్ రైట్స్‌‌‌‌గా చూడాలని, ఈ సెగ్మెంట్లలో ప్రైవేటైజేషన్ మోడల్‌‌‌‌కు స్వస్తి చెప్పాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ‘‘దేశంలోని మహా ధనవంతులపై తాత్కాలికంగా అయినా సరే ఒక శాతం సర్‌‌‌‌చార్జ్‌‌‌‌ని విధించండి. ఆ రెవెన్యూని హెల్త్‌‌‌‌, ఎడ్యుకేషన్ వంటి సెక్టార్లలో ఇన్వెస్ట్ చేయండి” అని ప్రభుత్వాన్ని ఆక్స్‌‌‌‌ఫామ్‌‌‌‌ కోరింది. కరోనా సంక్షోభంతో జాబ్‌‌‌‌లు కోల్పోయిన వారిలో 28 శాతం మంది మహిళలే ఉన్నారని వివరించింది. మూడొంతుల్లో రెండొంతుల మంది ఆదాయాలు తగ్గిపోయాయని వెల్లడించింది. కిందటేడాది బడ్జెట్‌‌‌‌లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు కేటాయించింది చాలా తక్కువని అభిప్రాయపడింది. బిలియనీర్ల లిస్టులో చివరిలోని 10 మంది కిందటేడాది సంపాదించిన మొత్తంతో పోలిస్తే.. ఈ మినిస్ట్రీకి అందులో సగం కూడా కేటాయించలేదని చెప్పింది. ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న వారిపై 2 శాతం ట్యాక్స్ వేస్తే, ఉమెన్ అండ్ చైల్డ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్ మినిస్ట్రీకి కేటాయించే ఫండ్స్‌‌‌‌ 121 శాతం పెంచొచ్చని అంచనావేసింది.

ట్యాక్స్‌‌లు ఇట్ల వేస్తే.. ఈ స్కీమ్స్‌‌ నడపొచ్చు


అత్యంత ధనవంతులైన 10% మందిపై అదనంగా 1% ట్యాక్స్‌‌ వేస్తే 17.7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను ప్రొవైడ్ చేయొచ్చు.
టాప్ 98 మంది బిలియనీర్లపై ఒక శాతం ట్యాక్స్ విధిస్తే.. ఆయుష్మాన్ భారత్‌‌ పథకాన్ని ఏడేళ్ల పాటు నడిపించవచ్చు.
టాప్ 100 మంది బిలియనీర్లు కిందటేడాది సంపాదించిన సంపదతో ఏకంగా 365 ఏళ్ల పాటు నేషనల్ రూరల్‌‌ లైవ్లీహుడ్‌‌ మిషన్‌‌ స్కీమ్‌‌ను నడిపించొచ్చు. మహిళల సెల్ఫ్‌‌ హెల్ప్‌‌ గ్రూప్‌‌లకు సపోర్ట్ అందించొచ్చు.
అత్యంత ధనవంతులైన 98 మందిపై 4 శాతం ట్యాక్స్ వేస్తే.. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌‌ అండ్‌‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌కు రెండేళ్ల పాటు సపోర్ట్ ఇవ్వొచ్చు. 142 మంది సంపద కేంద్ర బడ్జెట్‌‌ కంటే 41% ఎక్కువ. వీరిపై ఒక శాతం ట్యాక్స్ విధిస్తే ఆ రెవెన్యూతో స్కూల్‌‌ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్‌‌మెంట్‌‌కు ఏడాది సాయం అందించొ చ్చు. అదే 4% ట్యాక్స్ విధిస్తే 17 ఏండ్లు మధ్యాహ్న భోజన పథకాన్ని నడపొచ్చు.
టాప్ 100 మంది బిలియనీర్లపై ఏడాదికి 4 శాతం వెల్త్ ట్యాక్స్ వేస్తే మిషన్‌‌ పోషణ్ 2.0, అంగన్‌‌వాడీలు, పోషణ్‌‌ అభియాన్, టీనేజ్‌‌ అమ్మాయిలు, పసి పిల్లల కోసం తెచ్చిన స్కీమ్స్‌‌ను 10 ఏళ్ల పాటు కొనసాగించొచ్చు.