- తనిఖీలు చేసి ఫేక్ అని తేల్చిన పోలీసులు
బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ఈ వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ కోర్టు ప్రాంగణంలో బాంబులు అమర్చామని మెయిల్ పంపడంతో శుక్రవారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. జడ్జీలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత బుధవారం వచ్చిన మెయిల్ తరహాలోనే ఈసారి కూడా గురువారం ఉదయం 8:27 గంటలకు సీబీఐ కోర్టు సూపరింటెండెంట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. “బ్లాస్ట్ ఆన్ హోలీ ఫ్రైడే” అంటూ కోర్టు ప్రాంగణంలో 12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చామని, మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయని పేర్కొన్నారు. ఇస్లామిక్ ప్రార్థనకు ముందు జడ్జిలు, లాయర్లు ప్రాంగణాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరించారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. తరుచుగా ఫేక్ మెయిల్స్ పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
