కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. సమ్మర్ హాలిడేస్ పూర్తి కావస్తున్న క్రమంలో వీకెండ్ కూడా కావడంతో శనివారం ( జూన్ 13 ) తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ కంప్లెక్స్ బయట ఉన్న నారాయణగిరి షెడ్లలో క్యూ లైన్లు దాటి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కిలోమీటర్ల మేర దర్శనం కోసం వేచి ఉన్నారు భక్తులు. ఈ క్రమంలో ఉచిత సర్వదర్శనానికి దాదాపు 24 గంటలు సమయం పడుతోందని..SSD టోకెన్ భక్తులకు పది గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని తెలిపారు అధికారులు.
ఈ క్రమంలో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఒక్క రోజే 74వేల 636 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు అధికారులు. 43వేల 84 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో రూ. 4.64 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
