బెంగాల్ ఎన్నికలు: మీ గడప వద్దకే వైద్యం.. 10 కీలక హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల చేసిన దీదీ

బెంగాల్ ఎన్నికలు: మీ గడప వద్దకే వైద్యం.. 10 కీలక హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల చేసిన దీదీ
  • బెంగాల్ ప్రజలకు సీఎం మమతా బెనర్జీ ఎన్నికల హామీ
  • నిరుద్యోగులకు రూ.1500
  • మహిళల ఆర్థిక సాయం రూ.500 పెంపు

కోల్‌‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలను పొడిగించడంతో పాటు వైద్య సేవలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక హామీలను పొందుపరిచారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తామని మమత ప్రకటించారు. ఇందులో ప్రధానంగా మహిళలకు అందజేస్తున్న నెలవారీ ఆర్థిక సహాయం (లక్ష్మీర్ భండార్)ను రూ.500 పెంచారు. ఇక నుంచి జనరల్​ కేటగిరీకి చెందిన మహిళలు నెలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ. 1,700 అందజేస్తామని తెలిపారు. నిరుద్యోగం సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ‘బంగ్లార్ యువ-సాథీ' పథకం ద్వారా నిరుద్యోగులకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. అలాగే, మేనిఫెస్టోలో రైతుల సంక్షేమానికి కూడా ప్రముఖ స్థానం కల్పించారు.

రాష్ట్ర వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి, రైతులు, భూమిలేని రైతులకు మద్దతుగా నిలిచేందుకు రూ.30 వేల కోట్ల ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌‌ను కేటాయిస్తామని మమత హామీ ఇచ్చారు. వీటితో పాటు ‘దువారే సర్కార్’ తరహాలో ‘దువారే చికిత్స’ (ఇంటి వద్దకే వైద్యం) పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు.

ఈ పథకం కింద ప్రతి బ్లాక్, పట్టణాల్లో ప్రతి సంవత్సరం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, వివిధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు నేరుగా ఇంటివద్దకే వెళ్లి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారు.  

రాష్ట్రంలో అనధికారిక రాష్ట్రపతి పాలన: మమత

బెంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్​ఆర్​సీ, జనాభా లెక్కల పేరుతో ప్రజల పౌరసత్వాన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం మీడియాతో ఆమె  మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలుసుకున్న బీజేపీ.. రాష్ట్రంలో ‘అనధికారిక రాష్ట్రపతి పాలన’ను విధించిందని పేర్కొన్నారు.

వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సహకరించేలా.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చూస్తున్నాయని ఆమె ఆరోపించారు. బెంగాల్‌‌లోకి డబ్బు, ఆయుధాలను అక్రమంగా తరలించేందుకు వీలుగా అధికారులను బదిలీ చేస్తోందని ఆమె ఎన్నికల సంఘంపై మండిపడ్డారు.