స్కూటీ పైనుంచి పడి మద్యం సీసా గుచ్చుకొని వెస్ట్ బెంగాల్ వాసి మృతి

స్కూటీ పైనుంచి పడి మద్యం సీసా గుచ్చుకొని వెస్ట్ బెంగాల్ వాసి మృతి

మియాపూర్, వెలుగు: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి స్కూటీ పైనుంచి పడ్డాడు.. మద్యం సీసా గుచ్చుకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా అలైపూర్ కు చెందిన రతన్ కిర్తోనియా(41) ఉపాధి కోసం ఏడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ సి బ్లాక్ లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఇద్దరు యువకులతో కలిసి ఉంటున్నాడు. ఓ హోటల్​లో సర్వీస్ బాయ్ గా చేస్తున్నాడు. 

ఈ నెల 23న రతన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో స్నేహితులతో కలిసి విందు చేసుకున్నాడు. మద్యం అయిపోవడంతో న్యూ హఫీజ్ పేట్ లోని వైన్స్​వద్దకు వెళ్లి కొనుగోలు చేశాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న రతన్ తిరిగి ఇంటికి వెళ్లేందుకు తన రూమ్​మేట్ సిబ్బును స్కూటీ తీసుకొని రమ్మంటే వచ్చాడు. రతన్​ను వాహనం ఎక్కించుకున్న సిబ్బు రాంగ్​రూట్​లో వెళ్లాడు. 

దీంతో రతన్ అదుపుతప్పి కిందపడ్డాడు. అతని చేతిలో ఉన్న మద్యం సీసా పగిలి మెడకు గుచ్చుకోవడంతో తీవ్ర గాయమైంది. స్థానికులు కొండాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.