వరంగల్ జైలు జాగా ఏంజేస్తరో!

వరంగల్ జైలు జాగా ఏంజేస్తరో!
  • 135 ఏండ్ల వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ 3 రోజుల్లో నేలమట్టం
  • ఎక్కడ ఏం కడతారో ప్లాన్‍ లేకుండా.. హడావుడిగా కూల్చివేత 
  • కొత్త జైలు కోసం ల్యాండ్‍ ఇవ్వలే.. శంకుస్థాపన చేయట్లే 
  • అజాంజాహి,  టైర్‍రిట్రెడింగ్‍ ల్యాండ్​లాగానే ప్రైవేట్​ పరమవుతుందే మోనని అనుమానాలు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న  వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ను  కేవలం మూడురోజుల్లో నేలమట్టం చేశారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా గోప్యంగా కూల్చివేత ముగించారు. ఇక్కడ  సూపర్‍ స్పెషాలిటీ హస్పిటల్‍ కడతామంటున్న అధికారులు ..  జైల్​కు చెందిన 64 ఎకరాల్లో హాస్పిటల్​ను ఎక్కడ, ఏ వైపు నిర్మిస్తారు? ఎంత జాగాలో కడతారు.. ? మిగిలిన జాగా దేనికి వినియోగిస్తారో చెప్పట్లేదు.  పూర్తి స్థాయి ప్లాన్‍ లేకుండానే  చేస్తున్న పనులపై విమర్శలు వస్తున్నాయి.  సిటీ సెంటర్లోని వందల కోట్ల విలువైన వరంగల్‍ అజాంజాహి మిల్‍, హంటర్‍రోడ్డు టైర్​ రీట్రెడింగ్‍ భూముల మాదిరి.. వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ భూములు ఎక్కడ ప్రైవేటోళ్ల చేతుల్లోకి పోతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్లాన్‍, డిజైన్‍ లేకుండానే.. శంకుస్థాపనకు రెడీ  
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍లో నయా సెక్రటేరియట్‍, జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‍ బిల్డింగ్‍లు.. యాదాద్రి టెంపుల్‍, వరంగల్‍ సిటీలో భద్రకాళి బండ్‍ నిర్మాణం చేపట్టేముందు వాటికి  ప్లాన్లు  రూపొందించారు. డిజైన్‍ గీయించారు. ఎక్కడ ఏ నిర్మాణం వస్తుందో జనాలకు వివరించారు.  అలాంటిది వందల కోట్లతో చేపట్టనున్న సూపర్‍ స్పెషాలిటీ హస్పిటల్‍ విషయంలో ఇప్పటివరకు అలాంటివేవీ లేవు. కెనడా తరహాలో 24 అంతస్తుల్లో హస్పిటల్‍ నిర్మాణం చేస్తామని చెప్పడం తప్పించి అది ఎలా ఉంటుంది. ఎంత స్థలం.. ఎంత బడ్జెట్‍ అవసరం.. ఎన్నికోట్లు రిలీజ్‍ చేస్తున్నారు..? ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనే సమాచారం మాత్రం ఎవరికీ తెలియదు.

పబ్లిక్‍ ఎమోషన్స్ పట్టించుకోలే
వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ను 1885లో అప్పటి నిజాం రాజులు నిర్మించారు.  64.5 ఎకరాల్లో  కట్టించిన ఈ జైళ్లో 27 బ్యారక్స్, 6 వాచ్‍ టవర్స్, 6 ఆఫీసర్‍ క్వార్టర్స్, 80 స్టాఫ్‍ క్వార్టర్స్ ఉండేవి. 267 మంది డ్యూటీలు చేశారు. ఖైదీలకు ట్రీట్మెంట్​ కోసం 50 బెడ్లతో హస్పిటల్‍ ఉండేది.  నిన్నమొన్నటి వరకు 956 మంది ఖైదీలు ఇందులో ఉన్నారు. కాగా సీఎం ఆర్డర్‍ వేశాడనే పేరుతో 15 రోజుల్లో జెట్‍ స్పీడ్‍తో జైల్లోని ఖైదీలు, ఇన్‍ఫ్రా స్ట్రక్చర్‍ వేరేచోటకు తరలించి మొత్తం నేలమట్టం చేశారు. జైలు ఎదురుగా కనీసం ఒక ఫొటో దిగాలనే ప్రజల సెంటిమెంట్‍, భావోద్వేగాలను కూడా పట్టించుకోకుండాకూల్చివేశారు.

జైల్‍ పనులకు.. శంకుస్థాపన మరిచిన్రు
వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ స్థానంలో సూపర్‍ స్పెషాలిటీ హస్పిటల్‍ కట్టి.. మరోచోట అంతే వేగంతో కొత్త జైల్‍ నిర్మిస్తామని సీఎం మాటిచ్చారు. కొత్త జైలును ఎక్కడ కట్టాలన్న అంశంమీద ఏండ్ల తరబడి రివ్యూలు, పరిశీలనలు జరుగుతున్నాయి. కానీ..ఇంకా జైలు స్థలం  
ఖరారు చేయలేదు. సూపర్‍ స్పెషాలిటీ హస్పిటల్‍ పనులకు శంకుస్థాపన జరిగేరోజే.. కొత్త సెంట్రల్‍ జైల్‍ పనులకు సైతం శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు జైళ్ల శాఖ డీజీ రాజీవ్‍ త్రివేది చెప్పారు. కానీ.. దాని శంకుస్థాపన ప్రస్తావనే లేదు.

జైల్‍ భూములు ప్రైవేటోళ్లకు ఇస్తారనే ప్రచారం 
సూపర్‍ స్పెషాలిటీ  హస్పిటల్‍ నిర్మాణానికి అవసరమైన ప్లాన్‍, డిజైన్‍ లేకుండానే జైలును హడావిడిగా కూల్చడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ఇప్పటికే వందల కోట్ల విలువ చేసే వరంగల్‍ అజాంజాహిమిల్‍ భూములను రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారుల చేతుల్లో పెట్టారు. హన్మకొండ హంటర్‍రోడ్డులోని టైర్‍రీట్రెడింగ్‍ సెంటర్‍ కరీంనగర్‍ తరలించి.. ఆ స్థలాన్ని  అధికార పార్టీకి చెందిన లీడర్లకు లీజ్‍ పేరుతో కట్టపెట్టారు. దీంతో జిల్లా జనాల్లో టెన్షన్‍ నెలకొంది. సెంట్రల్‍ జైల్‍ భూములను కూడా ఏదో రకంగా బయటి వ్యక్తులకు లీజ్‍ ఇస్తారనే భయాందోళన ప్రజల్లో ఉంది.