కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం : కాంటినెంటల్ వైద్యులు

కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం : కాంటినెంటల్ వైద్యులు

హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు. కృష్ణను వెంటిలేటర్‌పై ఉంచామని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 24 గంటల నుంచి 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని ప్రకటించారు. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామన్న వైద్యులు.. ఆయన్ను అర్థరాత్రి అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. తీవ్ర గుండెపోటుతో వచ్చిన కృష్ణకు సీపీఆర్‌ చేశామన్నారు. కార్డియాక్‌ అరెస్టుకు పలు కారణాలు ఉంటాయని, ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. శరీరం సహకరిస్తుందా..? లేదా అనేది ఊహించి చెప్పలేమని, రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని కాంటినెంటల్ వైద్యులు స్పష్టం చేశారు.

అంతకుముందు.. అర్ధరాత్రి 2గంటల సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తడంతో కృష్ణను ఆయన కుటుంబ సభ్యలు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కృష్ణకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ట్రీట్మెంట్ ప్రారంభించిన వైద్యులు.. ఉదయం కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని, శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేర్చామని, 24గంటల తర్వాత ఆస్పత్రి నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేస్తారని నరేశ్‌ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే  హాస్పిటల్ నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేయనున్నట్లు ముందుగా అందరూ భావించారు. కానీ, ఇంతలోనే మళ్లీ ఆయన పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.