ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగస్టర్ కమ్ పొలిటీషియన్ ఆనంద్ మోహన్ ఏప్రిల్ 26న జైలు నుంచి బయటకు రానున్నారు. అతనితో పాటుగా 14 ఏళ్లకు పైగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న 26 మందిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బీహార్ ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్‌పై బయటకొచ్చిన ఆనంద్... ఏప్రిల్ 26 బుధవారం రోజున రెమినేషన్ పై విడుదల కానున్నారు.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషులకు జైలు శిక్షను మినహాయించడాన్ని నిషేధించిన నిబంధనను ఇటీవల బీహార్ ప్రభుత్వం తొలగించింది. 14 ఏళ్ల జైలు శిక్ష లేదా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీల కోసం కొత్త నిబంధనలు ఉన్నాయని రాష్ట్ర న్యాయ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. నితీష్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐఏఎస్ జి కృష్ణయ్య ఎవరు? హత్య కేసు ఎంటీ?
1994లో లాలూ ప్రసాద్ హయాంలో బిహార్ లో అండర్‌వరల్డ్ డాన్ చోటాన్ శుక్లాను మరో గ్యాంగ్ స్టర్ మద్దతుదారులు దారుణంగా కాల్చి చంపారు. 1994 డిసెంబర్ 5న చోటాన్ శుక్లా అంత్యక్రియల్లో ఆనంద్ మోహన్ పాల్గొన్నారు. అతని పిలుపు మేరకు చాలామంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ టైమ్ లో అటు వైపుగా వెళ్తున్న గోపాల్‌గంజ్ జిల్లా కలెక్టర్.. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన దళిత ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యను కారులోంచి బయటకు లాగా విచక్షణరహితంగా దాడి చేసి చంపేశారు. అయితే ఇదంతా ఆనంద్ మోహన్ దగ్గరుండి మరి ప్రేరేపించినట్లుగా చెబుతారు. 2007లో కింది కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దీంతో దేశ చరిత్రలో మరణశిక్ష పడిన తొలి రాజకీయ నాయకుడిగా ఆనంద్ మోహన్ రికార్డులకు ఎక్కారు. అతనికి పడ్డ శిక్షను ఆ తర్వాత పాట్నా కోర్టు జీవితఖైదుగా మార్చింది. తాజాగా తీష్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదల కానున్నారు.
జి కృష్ణయ్య భార్య ఏం అంటున్నారంటే ?
15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదల కాబోతుండటం పట్ల హత్యకు గురైన ఐఎఎస్ అధికారి భార్య ఉమా కృష్ణయ్య అగ్రహాం వ్యక్తం చేశారు. ఆనంద్ మోహన్ సింగ్ విడుదలకు బిహార్‌లో కుల రాజకీయాలే కారణమని ఉమాదేవి ఆరోపించారు. రాజ్‌పుత్ ఓట్లను పొందడం కోసమే అతన్ని జైలు నుంచి విడుదల చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లేకపోతే ఒక క్రిమినల్‌ను విడుదల చేయాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. బిహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతోందని అవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆనంద్ మోహన్ ఎవరు?
భారత స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ బహదూర్ సింగ్ కుమారుడే ఈ ఆనంద్ మోహన్ . ఆయన రాజకీయాల్లో ఉన్న టైమ్ లో అతనిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, కానీ వాటిలో దేనిలోనూ కూడా అతనికి శిక్ష పడలేదు. అంతేకాకుండా అతనిపై ఉన్న అనేక కేసులు ఎత్తివేయబడ్డాయి. కృష్ణయ్య హత్యకేసులో అతనితో పాటు అతని భార్య లవ్లీ ఆనంద్‌తో సహా మరో ఆరుగురికి శిక్ష పడింది. ఆనంద్ మోహన్ కుమారుడు చేతన్ అనంద్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం చేతన్ ఆర్జేడి తరుపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.