రోజుకు 50 వేల టెస్టులన్నా చేయకపోతే ఎట్ల?

రోజుకు 50 వేల టెస్టులన్నా చేయకపోతే ఎట్ల?

ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలోనే రోజుకు 40 వేలు చేస్తున్నరు: హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచకపోవడంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలోనే రోజుకు 40 వేల టెస్టులు చేస్తుంటే, ఇంత పెద్ద రాష్ట్రంలో రోజుకు కేవలం 50వేల టెస్టులన్నా చేయకపోతే ఎట్ల? అని ప్రశ్నించింది. రోజుకు 50వేల టెస్టులు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశించగా, దానికి రాష్ట్ర సర్కార్ అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో ఈ కామెంట్ చేసింది. ప్రజల ఆరోగ్యం కోసం టెస్టులు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా విషయంలో ఫైల్ అయిన పిటిషన్లపై చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం విచారణ చేపట్టింది. మొత్తం 24 పిల్స్, ఒక కోర్టు ధిక్కార పిటిషన్ ఫైల్ కాగా.. ఇప్పటికే వ్యాక్సినేషన్ దశకు చేరుకున్నామని, కరోనా కట్టడికి సర్కార్ చర్యలు బాగానే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ముఖ్యమైన మూడు పిల్స్ పైనే విచారణ చేపడతామని బెంచ్ స్పష్టం చేసింది.

కట్టడికి చర్యలేం తీసుకున్నరు?

ఈ నెల 25 నుంచి రెండు వారాల పాటు చేసే టెస్టులపై పూర్తి రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్‌‌ టెస్టులు ఎన్ని చేశారో? ఎన్ని పాజిటివ్‌‌ కేసులు వచ్చాయో?  చెప్పాలంది. పోయినేడాది జూన్ నుంచి సీరో సర్వైలెన్స్ సర్వే ఎన్నిసార్లు నిర్వహించారో, ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయాలంది. కొత్త కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయో, వాటి కట్టడికి తీసుకున్న చర్యలెంటో తెలియజేస్తూ ఫిబ్రవరి 19 నాటికి రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. కరోనా కేసులు బాగా తగ్గాయని, హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రోజుకు 50 వేల టెస్టులు చేస్తున్నామని విన్నవించారు. విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా పడింది.