- బీఎంసీ ఎన్నికల వేళ రాజ్ థాకరే వివాదాస్పద కామెంట్
- అన్నామలైని రసమలై అంటూ ఎద్దేవా
- ముంబైలో అడుగుపెడితే కాళ్లు నరికేస్తామని వార్నింగ్
- బెదిరింపులకు భయపడబోనన్న బీజేపీ తమిళనాడు నేత
ముంబై: మున్సిపల్ ఎన్నికల వేళ ముంబైలో మరోసారి ప్రాంతీయ నినాదం తెరపైకి వచ్చింది. ‘హటావో లుంగీ, బజావో పుంగీ’ అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తాజాగా పిలుపునిచ్చారు. ఈ నెల 15న జరగనున్న బీఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం దాదర్లో జరిగిన ఎంఎన్ఎస్ ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరాఠా భూమి పుత్రులదే ముంబై అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ముందు స్థానికులకే దక్కాలని తేల్చిచెప్పారు. బీజేపీ తమిళనాడు మాజీ చీఫ్ అన్నామలై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ రాజ్ థాకర్ ఈమేరకు పిలుపునిచ్చారు. అన్నామలైని రసమలై అని సంబోధిస్తూ ఎద్దేవా చేశారు. అన్నామలై ముంబై వస్తే కాళ్లు నరికేస్తామని హెచ్చరించారు. అయితే, రాజ్ థాకరే బెదిరింపులకు భయపడేది లేదని అన్నామలై పేర్కొన్నారు. ముంబై వచ్చి తీరుతానని, తన కాళ్లు ఎవరు నరుకుతారో చూస్తానని అన్నామలై సవాల్ విసిరారు.
1960లలో బాల్ థాకరే పిలుపు..
ముంబైలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ దక్షిణాదివాళ్లే దక్కించుకుంటున్నారని, స్థానిక భూమి పుత్రులకు అవకాశాలు దక్కడంలేదని ఆరోపిస్తూ 1960 దశకంలో బాల్ థాకరే ‘హటావో లుంగీ, బజావో పుంగీ’ అంటూ పిలుపు నిచ్చారు. ఈ నినాదం అప్పట్లో మరాఠా యువతను కదిలించింది. దాదాపు దశాబ్దం పాటు దీని ప్రభావం కొనసాగింది.
అన్నామలై ఏమన్నారంటే..
ముంబై కేవలం మహారాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.. దేశ ఆర్థిక రాజధాని, అంతర్జాతీయ నగరం అని అన్నామలై అన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.40 కోట్లు అని, అంత సొమ్మును నిజాయితీపరుడి చేతిలోనే పెట్టాలని ముంబైకర్లకు పిలుపునిచ్చారు.
