ట్రంప్ పై మరిన్ని నేరాభియోగాలు.. రికో చట్టం కింద నమోదు

ట్రంప్ పై మరిన్ని నేరాభియోగాలు..  రికో చట్టం కింద నమోదు

అట్లాంటా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరిన్ని నేరాభియోగాలు నమోదయ్యాయి. ఆయన 2020 ఎన్నికల సందర్భంగా జార్జియా ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని జార్జియా గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం సహా 13 నేరాలను మోపింది. ట్రంప్ తో పాటు మరో 18 మందిపైనా అభియోగాలు నమోదు చేసింది. 

వీరిలో వైట్ హౌస్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మేడోస్, లాయర్లు జాన్ ఈస్ట్ మన్, రూడీ గిలియానీ తదితరులు ఉన్నారు. కోర్టు వీరందరిపైనా కఠినమైన ‘రాకెటీర్ ఇన్​ ఫ్లూయెన్స్ డ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్ (రికో)’ కింద అభియోగాలు నమోదు చేసింది. వీళ్లను వ్యవస్థీకృత నేరగాళ్లతో పోల్చింది. ఈ కేసులో 2021 జనవరిలో దర్యాప్తు ప్రారంభించిన ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ.. రెండేండ్ల తర్వాత నేరాభియోగాలు నమోదు చేశారు. పోయినసారి ఎన్నికల టైమ్ లో ట్రంప్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ లీకైంది. 

తాను గెలవాలంటే మరో 11,780 ఓట్లు కావాలని.. అవి దక్కేలా చూడాలని జార్జియా ఆఫీసర్ తో ట్రంప్ మాట్లాడినట్టుగా అందులో ఉంది. ఈ ఫోన్ కాల్ రికార్డు ఆధారంగా విచారణ చేపట్టి, క్రిమినల్ కేసు పెట్టారు. కాగా, ఇది ట్రంప్ పై నమోదైన నాలుగో క్రిమినల్ కేసు. ఇంతకుముందు ఈయనపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు.