ఆర్మీలోకి కాంట్రాక్ట్​ పద్ధతేంది? 

 ఆర్మీలోకి కాంట్రాక్ట్​ పద్ధతేంది? 
  • కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఫైర్

ముంబై: సైన్యంలో కాంట్రాక్ట్​ నియామకాలు ప్రమాదకరమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ‘అగ్నిపథ్’ పథకం పేరుతో యువత జీవితాలతో ఆటలాడుకోవద్దంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఆదివారం శివసేన 56వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఉద్ధవ్​ మాట్లాడారు. ‘‘ఇయ్యాల కాంట్రాక్ట్​ సైనికులంటున్నరు, రేపు అద్దెకు ప్రభుత్వం కావాలంటరు. ప్రధాని, ముఖ్యమంత్రుల ఎంపిక కోసం టెండర్లు పిలుస్తారు. ఇలాగే కొనసాగించాలనుకుంటే ప్రతిదానికీ అద్దెకు తీసుకుని తొలగించే, వాడి పడేసే నియామక విధానాలను అవలంబించాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మీరు నిలబెట్టుకోగలిగే వాగ్దానాలు మాత్రమే చేయండి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇస్తూ.. ఇట్లా అగ్నిపథ్, అగ్నివీరులు అంటూ పెద్ద పెద్ద పేర్లతో పథకాలు తెస్తారు. శివసేన అలా కాదు.. మేం చేయగలిగినవే చెప్పాం’’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అగ్నిపథ్​కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు జరిగినప్పటికీ.. మహారాష్ట్ర మాత్రం ప్రశాంతంగా ఉందని గుర్తుచేశారు.

పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వ్యవసాయ చట్టాలను తెచ్చినప్పుడు కేంద్రంపై రైతులు నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. దాంతో ఆ చట్టాలను వాపస్​ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇవాళ కేంద్రం అగ్నిపథ్ పేరుతో మరో సమస్య తెచ్చిందని, ఈ స్కీంలో ఎంపికైనవాళ్లు  నాలుగేండ్ల తర్వాత బయటికి వచ్చి నిరుద్యోగులుగా మిగిలిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.