ప్రధాన పార్టీలపై మునుగోడు ఎఫెక్ట్​ ఎంత?

ప్రధాన పార్టీలపై మునుగోడు ఎఫెక్ట్​ ఎంత?

భారత్‌‌‌‌లో ఉప ఎన్నికల ప్రభావం చాలా ఎక్కువ. 1971లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా, ఎస్. నిజలింగప్ప నేతృత్వంలోని మరో కాంగ్రెస్ వర్గం ఆమెను వ్యతిరేకించింది. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయినప్పటికీ, ఆమె సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌‌‌‌ను ఆమె ప్రత్యర్థులు పాలించారు. ఆ సమయంలో టీఎన్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచి సీఎంగా కొనసాగాలనుకున్నారు. ప్రసిద్ధ గోరఖ్‌‌‌‌నాథ్ దేవాలయం మతగురువు అవైద్యనాథ్ తాను ఎమ్మెల్యేగా ఉన్న మణిరామ్​అసెంబ్లీ స్థానంకు1971లో రాజీనామా చేశాడు. దీంతో సింగ్ అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈ అవకాశాన్ని పసిగట్టిన ఇందిరా గాంధీ.. ఆ ఉప ఎన్నికలో ప్రధానమంత్రిగా ప్రచారం చేశారు. ఇంకేముంది ముఖ్యమంత్రి ఓడిపోయి.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఇదే అదునుగా ఇందిరా గాంధీ 1971లో మధ్యంతర(పార్లమెంట్) ఎన్నికలకు వెళ్లి క్లీన్ స్వీప్ చేశారు. ఉత్తర ప్రదేశ్​లో మణిరామ్​ఉప ఎన్నిక అప్పట్లో జాతీయ స్థాయిలో ప్రభావం చూపింది. ఇక్కడ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అలాంటిదే. ఇది దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. తెలంగాణ రాజకీయాలపై దీని ఎఫెక్ట్​ఉంటుంది. ఈ బైపోల్​లో టీఆర్​ఎస్​ఓడిపోయి ఉంటే కేసీఆర్‌‌‌‌ ముఖ్యమంత్రిగా ఉన్నా, రాష్ట్రంపై ఆయన పట్టు కోల్పోయారని తేలేది. ఎమ్మెల్యేలు కూడా 2023 ఎన్నికల్లో తాము గెలవలేమని భావించేవారు. స్వల్ప ఓట్లతో టీఆర్ఎస్​ గట్టెక్కింది. 

తిరుమంగళం ఉప ఎన్నికను మించి..

తమిళనాడులోని తిరుమంగళం బైపోల్, మునుగోడు ఉప ఎన్నికకు మధ్య పోలికలు ఉన్నాయి. 2011లో తమిళనాడులోని తిరుమంగళంలో ఉపఎన్నిక జరిగింది. కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి తిరుమంగళం బైపోల్​ద్వారా దక్షిణ తమిళనాడులో తన రాజకీయ ప్రాబల్యాన్ని తండ్రికి చూపాలనుకున్నాడు. భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెరలేపాడు. ఉప ఎన్నిక‌‌‌‌ సమీపించిన వేళ వార్తాపత్రిక‌‌‌‌ల డెలివ‌‌‌‌రీ బాయ్‌‌‌‌ల‌‌‌‌ను మాట్లాడుకుని న్యూస్​పేపర్లలో డబ్బులు పెట్టి నేరుగా ఓటర్లకు పంపే విధానాన్ని అమలు చేశారు. పొద్దున్నే నిద్రలేచి న్యూస్​పేపర్​తెరిచిన తిరుమంగళం ప్రజలు అందులో డబ్బులు ఉండటం చూసి  థ్రిల్​అయ్యారు. ఇంకేముంది డీఎంకే భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. న్యూస్​పేపర్లలో డబ్బులు పెట్టి ఓటర్లకు పంపిన తిరుమంగళం మోడల్​ అప్పట్లో దేశవ్యాప్త సంచలనం కాగా.. ఇప్పుడు మునుగోడు మోడల్​దాన్ని తలదన్నిందనే చెప్పాలి. బైపోల్​కు నెల రోజుల ముందు నుంచే విందులు, దావత్​లు, భోజనాలు, విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీతో మునుగోడు మరోసారి దేశవ్యాప్త వార్తల్లో నిలిచింది. ఇంత తీవ్ర స్థాయిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలపై భవిష్యత్​లో ప్రభావం చూపనుంది.

బీజేపీ పార్టీని విస్తరించాలి

మునుగోడులో బీజేపీకి 38 శాతం ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి శక్తిమంతుడనేది నిజమే అయినా, బీజేపీ మద్దతు లేకుండా 87, 000 ఓట్లను చేరుకోలేడనేది వాస్తవం. బీజేపీ పార్టీ క్యాడర్, మీడియా, రాజకీయ శక్తిని అందించింది. అందుకే అన్ని ఓట్లు వచ్చాయి. ఈ పరీక్షలో బీజేపీ ఓడిపోయినా దాదాపు గెలిచింది. ఈ ఎన్నిక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిచోట బీజేపీ మంచి అభ్యర్థులను నిలబెడితే.. ఫలితాలు వస్తాయని నిరూపించింది. మొత్తం119 నియోజకవర్గాలకు క్యాడర్‌‌‌‌ను విస్తరించడంపై బీజేపీ దృష్టి పెట్టాలి. బీసీలు, దళితులు, గిరిజనుల్లో పార్టీ విస్తరిస్తే ప్రతిచోటా సహజంగానే మంచి అభ్యర్థులు వస్తారు.
కాంగ్రెస్‌‌‌‌ ఆత్మపరిశీలన.. 
కాంగ్రెస్​అభ్యర్థి పాల్వాయి స్రవంతి సాధించిన ఓట్లు నల్గొండలో ఆమె తండ్రి గోవర్ధన్‌‌‌‌రెడ్డికి ఉన్న అపారమైన పట్టును చూపుతున్నాయి. డబ్బుల సునామీ వచ్చినా 23 వేల మంది స్రవంతికి ఓటేశారంటే గోవర్ధన్ రెడ్డి నిజాయితీపరుడని అక్కడి వాళ్లు బలంగా నమ్మారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో ఉన్నప్పటికీ స్రవంతి ఒంటరి పోరాటానికి వచ్చినవే తప్పితే.. రాహుల్​చరిష్మాతో పెద్దగా ఓట్లు రాలలేదు. ఈ విషయంపై కాంగ్రెస్ ​ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే పాల్వాయి స్రవంతి వంటి నేతలను పార్టీ వదులుకోవద్దు. ఆమె లాంటి వాళ్లతో సంప్రదాయ కాంగ్రెస్ నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు సెంట్రల్ కాంగ్రెస్ నాయకుడెవరూ స్రవంతి వద్దకు రాకపోవడం గమనార్హం. ఆర్​ఎస్​ప్రవీణ్​కుమార్​నేతృత్వంలో బీఎస్పీ కూడా మునుగోడులో పోరాట శక్తిని కనబరిచింది. 

కేసీఆర్-టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌పై ప్రభావం

మునుగోడు ఉప ఎన్నిక వాస్తవానికి కేసీఆర్​కు పెద్ద పరీక్షే. ఇందులో ఆయన గట్టెక్కాడు కాబట్టి సరిపోయింది కానీ.. ఓడిపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, 2023లో  తమకు టిక్కెట్లు రావు, వచ్చినా గెలవబోమని భావించే మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు. ఒక్క మునుగోడులో గెలిచేందుకు కేసీఆర్ ​మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ పెద్ద లీడర్లను రంగంలోకి దించి, పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఇంత చేస్తే స్వల్ప మెజార్టీతోనే కారు గట్టెక్కగలిగింది. 2023లో కేసీఆర్119 నియోజకవర్గాల్లో మునుగోడు స్థాయి ఎన్నికలను నిర్వహించడం సాధ్యమా? కాబట్టి మునుగోడు ఫలితాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కేసీఆర్‌‌‌‌ ఇప్పటికైనా పాలనపై దృష్టి సారించి తన పంథా మార్చుకోవాలి. ఓటర్లు రోజుకో సందడితో విసిగిపోయే అవకాశం ఉంది. వెనుకబడిన వర్గాలు బీజేపీలోకి మారిన విషయం కేసీఆర్‌‌‌‌కు తెలిసిందే. అయితే ఆయన పార్టీలో ఉన్న అగ్రవర్ణాల నేతలను పక్కన పెడితే వారు బీజేపీలోకి మారతారు. అందుకే ముందున్న కులాలను తిరుగుబాటు చేయకుండా ఎలా తగ్గించాలనే విషయంలో కేసీఆర్ పెద్ద డైలమాను ఎదుర్కొంటున్నారు. మునుగోడులో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు రెడ్డిలనే విషయాన్ని ప్రజలు గమనించారు. 1724లో ప్రారంభమై1948లో ముగిసిన నిజాం వంశ చరిత్ర కేసీఆర్‌‌‌‌కు కచ్చితంగా తెలుసు. నిజాంల ప్రధాన విధానం పోరాటం కాదు. మొఘలులు, టిప్పు సుల్తాన్, ఫ్రెంచ్, బ్రిటీష్‌‌‌‌లకు నిజాం మద్దతు ఇస్తూనే పాలన సాగించాడిక్కడ. ఎన్నడూ వారితో యుద్ధాలకు దిగలేదు. కేంద్రంలో బీజేపీతో వైరం పెట్టుకున్న కేసీఆర్.. బీఆర్ఎస్​తో జాతీయ రాజకీయాల్లోకి రావడం సరైనదేనా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం.. మునుగోడు లాంటి ఖరీదైన విజయాలు నిజానికి ఓటములే. 

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్