
"తంగేడు పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివిగాని చందమామ.. మల్లెన్నడొస్తావు చందమామ యాడాదికోసారి చందమామ.. మన్వొచ్చిపోవమ్మ చందనూమ.."
అంటూ తెలంగాణలోని ప్రతి ఇంట్లో సద్దులు ఐతుకమ్మ రోజు పండుగ సందడే ఉంటుంది. పొద్దు వాలిందంటే ఏ దిక్కు చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఊరువాడలన్నీ మురిసిపోతాయి. గౌరమ్మ ఒడి చేరిందని చెరువుగట్లన్నీ ఆనందంతో ఉప్పొంగుతాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని చోట్లా సద్దుల బతుకమ్మని ఘనంగా జరుపుకుంటారు.
బతుకమ్మని సాగనంపడానికి ఆడబిడ్డలంతా అత్తింటి నుంచి పుట్టింటికి వస్తారు. పొద్దు పొడవకముందే ఇల్లు, వాకిలి సర్దుకుని పట్టు బట్టలతో అందంగా ముస్తాబవుతారు. ఆ లోపే అన్నదమ్ములు వాళ్లకోసం చిట్టడవి, చేసు-చెలకలు, చెరువులు, కుంటలు వెతికి రంగురంగుల పూలని గంపలో మోసుకొస్తారు. అన్నదమ్ములు తెచ్చిన గునుగు, గుమ్మడి, తంగేడు. సీతజడ, చామంతి, గోరింట వంటి పూలతో అందంగా బతుకమ్మని పేర్చుతారు ఆడబిడ్డలు.
రాగి పళ్లెం లేదా తాంబాళంలో గుమ్మడి ఆకులు పేర్చి పసుపు, కుంకుమలు చల్లి ఆ తర్వాత బతుకమ్మను పేర్చుతారు. గోపురంలా పేర్చిన బతుకమ్మ పైన గుమ్మడి ఆకు పెట్టి పసుపుతో చేసిన గౌరమ్మని ఉంచుతారు. సాయంత్రానికల్లా వీధుల్లోకి చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. అర్ధరాత్రి వరకు ఆడిపాడి 'పోయిరా గౌరమ్మా' అంటూ సాగనంపుతారు.
రెండు బతుకమ్మలు
సద్దుల బతుకమ్మ రోజు రెండు బతుకమ్మలు చేస్తారు ఆడబిడ్డలు. ఆడబిడ్డకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు తోడుగా మరొకరిని పంపుతారు. అచ్చు అలానే బతుకమ్మని కూడా సాగనంపుతారు. పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా అనుకుని పాటలు పాడుతూ సాగనంపుతారు.
ప్రసాదాలు
సద్దుల బతుకమ్మ రోజు వాయినాలు ఇచ్చుకునేం దుకు పెసలు, బియ్యం పిండితో సత్తు, మలిద ముద్దలు తయారుచేస్తారు. బతుకమ్మని సాగనం పాక ఒకరికొకరు ఆ వాయినాల్ని ఇచ్చుకుంటారు.
మలిద ముద్దలు
కావాల్సినవి:
గోధుమపిండి - ఒక కప్పు
డ్రై ఫ్రూట్స్ - 100 గ్రా. బెల్లం - 200 గ్రా నెయ్యి- కొద్దిగా, కొబ్బరి - కొద్దిగా
యాలకులు- మూడు
సోంపు- టేబుల్ స్పూన్
తయారీ : గోధుమపిండిని ముద్దలా కలపాలి. నెయ్యి రాస్తూ పిండిని చపాతీల్లా ఒత్తి, రెండు వైపులా కాల్చాలి. వాటిని హాట్ బాక్స్ లో పెట్టాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, కొబ్బరి. యాలకులు, సోంపు కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. చపాతీలను కూడా ముక్కలుగా చేసి గ్రైండ్ చేయాలి. దీన్ని డ్రైఫ్రూట్స్ పౌడర్ కలపాలి. చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టాలి.
నోట్: మలిద ముద్దలు చేసేటప్పుడు చపాతీలు చల్లగా అయిపోతే ఉండ చేయడం కష్టం అవుతుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేయాలి.
బియ్యం సత్తుపిండి
కావాల్సినవి:
బియ్యం - ఒక కప్పు, చక్కెర- అరకప్పు నెయ్యి- రెండు టీ స్పూన్లు, యాలకులు - 3
తయారీ: ఒక గిన్నెలో బియ్యం వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత చక్కెర, యాలకులు కలిపి మెత్తగా పొడి చేయాలి. వేగించిన బియ్యం చల్లారాక వాటిని కూడా మెత్తగా పొడి పట్టాలి. ఇంకో గిన్నెలో నెయ్యి కరిగించి సన్నటి మంటమీద బియ్యప్పిండిని వేగించాలి. తర్వాత చక్కెరపొడి వేసి కలిపితే సత్తుపిండి రెడీ.
సద్దుల బతుకమ్మ రోజు వాయినాలు ఇచ్చుకునేం దుకు పెసలు, బియ్యం పిండితో సత్తు, మలిద ముద్దలు తయారుచేస్తారు. బతుకమ్మని సాగనం పాక ఒకరికొకరు ఆ వాయినాల్ని ఇచ్చుకుంటారు.
వెన్నముద్దల బతుకమ్మ ప్రసాదం
కావాల్సినవి:
బియ్యప్పిండి - నాలుగు టేబుల్ స్పూన్లు
వెన్న-రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు - కొద్దిగా
నూనె - వేగించేందుకు సరిపడా
యాలకులు - నాలుగు
చక్కెర - అర గ్లాస్
తయారీ:
గిన్నెలో బియ్యప్పిండి, వెన్న వేసి రెండు కలపాలి. ఆ తర్వాత కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ బియ్యప్పిండిని చపాతీ పిండి ముద్దలా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఉండలు చేయాలి. నూనె వేడిచేసి ఆ ఉండలను ఎర్రగా వేగించాలి. ఇంకో గిన్నెలో చక్కెర వేసి, అరగ్లాసు నీళ్లుపోసి పాకం పట్టాలి. చివర్లో యాలకులు వేసి స్టవ్ ఆపేయాలి. పాకంలో వెన్న ముద్దలను వేయాలి.