ఈటల గెలిస్తే  హుజూరాబాద్ ప్రజలకు ఏం వస్తది?

ఈటల గెలిస్తే  హుజూరాబాద్ ప్రజలకు ఏం వస్తది?

ఈటల రాజేందర్​ గెలిస్తే హుజూరాబాద్​ ప్రజలకు ఏం వస్తుందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఈటల భయంతోనే టీఆర్ఎస్​ ప్రభుత్వం హుజూరాబాద్​ నియోజకవర్గంలోని పెండింగ్​ పనులన్నీ చేస్తోంది. కొత్త పథకాలను హుజూరాబాద్​ కేంద్రంగానే ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్​కు సీఎం దండ వేసేలా చేయడం, సీఎంవోలో దళిత ఐఏఎస్ ఆఫీసర్​కు అవకాశం కలగడం ఈటల వల్లే సాధ్యమైంది. ఇప్పుడే ఇంత మార్పు కనిపిస్తుంటే.. ఇక ఈటల గెలిస్తే ప్రశ్నించే గొంతుకలకు స్వరం పెరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో సమాన అభివృద్ధి జరుగుతుంది.
హుజూరాబాద్  ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్  అభ్యర్థిని ప్రకటించగానే మంత్రి హరీశ్​రావు ప్రచార సభల్లో ఓ ప్రశ్న సంధిస్తున్నారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్  గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏం వస్తుంది? అని, ఈటల గెలిస్తే ప్రజలకు ఏమీ లాభం కలగదని, కానీ ఈటల మాత్రమే ఎమ్మెల్యే అవుతారని చెబుతూ వస్తున్నారు. రాజకీయ నాయకుల మాదిరిగా ప్రజలకు కూడా జ్ఞాపకశక్తి తక్కువని హరీశ్​రావు అనుకుంటున్నారా? అన్నీ తెలిసే మామను సంతోషపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారా? తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి ఏడున్నర ఏండ్ల కేసీఆర్ పాలన వరకూ రాష్ట్రంలోని బహుజనులకు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల వరకూ అన్ని విషయాలు సమయ సందర్భాలతోపాటు గుర్తున్నాయి. ముఖ్యంగా హరీశ్​రావు ప్రసంగాలపై ప్రజలు చర్చిస్తున్న విషయాలు చాలానే ఉన్నాయి. 
ఉద్యమ కాలంలో ఇలాగే ఆలోచిస్తే ఏం జరిగేది?
తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన బై ఎలక్షన్స్ లో అప్పటి రూలింగ్  పార్టీ అభ్యర్థులను కాదని టీఆర్ఎస్  పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గాలకు ఏం వస్తుందని ప్రజలు అలోచించి ఉంటే, డబ్బులకు, పథకాలకు ప్రలోభపడి ఉంటే అసలు టీఆర్ఎస్  అభ్యర్థులు అప్పట్లో గెలిచేవారా? ప్రజలను కేవలం ఓటర్లుగా చూస్తే తగిన గుణపాఠం తప్పదని ఇప్పటికైనా మంత్రి గ్రహించాలి. మాటల మాంత్రికుడిగా పేరున్న మామతోనే పోటీ పడుతున్న అభ్యాస మాటల మాంత్రికుడు హరీశ్​ అది ఉద్యమ కాలంలో జరిగిందని సంతృప్తిపడవచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ కుటిల రాజకీయ పార్టీ అని సమర్థించుకుని గర్వపడవచ్చు. కానీ కేసీఆర్ అండ్ కో హుజూరాబాద్ లో చేస్తున్న నవరస నటనా విన్యాసాలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్  మాత్రం తన ప్రభుత్వం ఇప్పుడే కొలువుదీరినట్లుగా హుజూరాబాద్​ను రాష్ట్రంగా భావిస్తూ, మండలానికి ఒక మంత్రిని పెట్టి, గ్రామానికి ఒక ఎమ్మెల్యేను పెట్టి ప్రజలను నమ్మించడానికి వాళ్ల మధ్య పోటీలు పెట్టి సంతోషపడవచ్చు. హుజూరాబాద్​ బై ఎలక్షన్​పై మాత్రమే దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర పాలనను, కృష్ణా నదీ జలాల వివాదాన్ని, కరోనా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారు.
చిన్న నాయకులకు గౌరవం పెరిగింది
ఈటల వల్ల ఇతర పార్టీల్లోని చిన్న చిన్న నాయకులకు, కుల సంఘాల నాయకులకు కూడా గౌరవం పెరిగింది. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి అవుతున్నాయి. అన్ని కులాలకు కమ్యూనిటీ బిల్డింగ్ ల కోసం స్థలాలు, నిధుల శాంక్షన్  లెటర్లు అందుతున్నాయి. బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్​ అపాయింట్ మెంట్  దొరుకుతున్నది. సొంత పార్టీ స్థానిక నాయకులకు కాంట్రాక్ట్​ పనులు ఎక్కువైనవి. ఈటల రాజేందర్  పాత మిత్రులకు కేబినెట్  పదవులు, పాత ప్రత్యర్థికి ఎమ్మెల్సీ పదవి దక్కాయి. విద్యార్థి నాయకునికి ఎమ్మెల్యే సీటు వచ్చింది. ఎస్సీ సబ్  ప్లాన్  బకాయి నిధులు దళితబంధు పథకంతో వసూలు అవుతున్నవి. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలు బహుజన నాయకుల కేంద్రంగానే జరుగుతున్నవి. అన్నింటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్  చిత్రపటానికి మొదటిసారిగా సీఎం పూలదండ వేసి నమస్కరించేలా చేయడం, ఏడున్నర సంవత్సరాల తర్వాత సీఎంవోలో దళిత ఐఏఎస్  ఆఫీసర్ కు అవకాశం కలగడం ఇవన్నీ ఈటల వల్లనే సాధ్యపడింది.
ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతది
ఇప్పుడే రాష్ట్రంలో ఇంత మార్పు జరిగితే, ఈటల ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ధైర్యం పెరుగుతుంది. ప్రజలకు ఆత్మవిశ్వాసం, ప్రశ్నించే గొంతుకలకు స్వరం పెరుగుతుంది. సామాజిక తెలంగాణ కోసం అడుగులు పడతాయి. అన్ని నియోజకవర్గాల్లో సమాన అభివృద్ధి జరుగుతుంది. రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు మనోధైర్యం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతాయి. ప్రజలను ఓటర్లుగా చూస్తే ఏ పాలక ప్రభుత్వానికైనా గుణపాఠం తప్పదనడానికి హుజూరాబాద్ ప్రజలు ఉద్యమ కాలం నుంచి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈటల రాజేందర్​ను గెలిపించుకొనడమే సాక్ష్యం. ఇప్పటికే ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజల మనస్సులో నైతికంగా గెలిచారు. ఇక మిగిలింది లాంఛనమే. జరగాల్సింది ఎన్నికల ప్రక్రియ మాత్రమే.
దళితబంధు వెనుక  రాజకీయ కుట్ర
రాష్ట్రంలోని పేద దళితులందరూ ఒక్క హుజూరాబాద్  నియోజకవర్గంలోనే ఉన్నట్లు, వారిని మాత్రమే వందల కోట్లతో ఆర్థికంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోతుందన్నట్లు కేసీఆర్  నమ్మిస్తున్నారు. హుజూరాబాద్ లో దళితబంధు పథకం ప్రారంభించడం ఈటల రాజేందర్​ను ఓడించడానికే అని అందరూ అనుకుంటున్నా.. దీని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర కోణం దాగి ఉంది. దళితబంధు పథకం అనే మల్టీ టార్గెటెడ్  పొలిటికల్  వెపన్ తో ఎంఆర్పీఎస్-మంద కృష్ణ, బీఎస్పీ-ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​ల కేడర్​ను డిఫెన్స్​లోకి నెట్టే ప్రయత్నం కావచ్చు. అలాగే రేవంత్-కాంగ్రెస్​ను, ఈటల-బీజేపీని ఇరుకున పెట్టాలన్న కుట్ర కూడా ఉందని గ్రహించాలి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో ఎట్లైనా గెలవాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కేంద్రీకరించడంతో మీడియా అటెన్షన్  పూర్తిగా అక్కడే ఉంది. దీంతో తెలంగాణ ప్రజల దృష్టిలో ఈటల రాజేందర్  కూడా ముఖ్యమంత్రి స్థాయి కాండిడేట్ గా ఎదిగారు. దీని వల్ల హుజూరాబాద్  నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరుగుతుందనే చర్చ నడుస్తోంది.