టీఆర్ఎస్ నేతల కన్నీటి గాథకు ఏం బదులిస్తరు?

టీఆర్ఎస్ నేతల కన్నీటి గాథకు ఏం బదులిస్తరు?
  •     ఆక్సిజన్​ అందకే అమ్మ చనిపోయిందన్న మునీర్ పాషా గోసలో వాస్తవం లేదా?
  •     45 ఏండ్లు దాటినోళ్లకు ఆక్సిజన్​ పెడ్తలేరన్న గడ్డమీది జీవన్​రాజు ఆవేదన నిజం కాదా?
  •     కష్టకాలంలో సొంత లీడర్లు పట్టించుకోలేదన్న కంప వినోద్​ బాధకు అర్థం లేదా?
  •     అధికార పార్టీ నేతల కన్నీటి వీడియోలకు సమాధానం ఏమిటి? 
  •     అబద్ధాలను రాసి జనాల్ని నమ్మించాల్నా..?
  •     సర్కారు తప్పులను దాచి అంతా సూపర్​ అని కీర్తించాల్నా?

హైదరాబాద్, వెలుగు: ‘‘అన్నీ బాగున్నాయి.. అంతా బాగుంది..! సూపరో సూపర్​..!! కరోనాను కంట్రోల్​ చేయడంలో తెలంగాణ సర్కారు దేశానికే దిక్సూచి..!!! రాష్ట్రంలోని  సర్కారు ఆసుపత్రుల్లో అద్భుతమైన సౌలతులున్నాయి..  బెడ్లకు కొరత లేదు.. కరోనా టెస్టులకు ఆగమే లేదు.. వ్యాక్సిన్​ డ్రైవ్ యమ స్పీడ్​గా జరుగుతోంది.. మెడిసిన్​ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది.. ఎన్నంటే అన్ని రెమ్డిసివిర్​ ఇంజక్షన్లున్నాయి.. ఆక్సిజన్​ సిలిండర్లు అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి..’’ వీటిలో ఏ ఒక్కటీ నిజం కాకున్నా ఇలాంటి తప్పుడు రాతలే రాసి జనాన్ని నమ్మించాల్నట..! ఇలాంటి వార్తలే రాయాలని, నిజాలను దాచిపెట్టి, అందమైన అబద్ధాలతో కట్టుకథలను అల్లాలని అధికారపార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ మీడియాకు సుద్దులు చెబుతోంది. ప్రభుత్వం కరోనా కేసులు, డెత్​లు దాచిపెట్టినట్లుగా పత్రికలు, చానళ్లు కూడా ప్రజలకు నిజాలు తెలియకుండా దాచి పెట్టాలంటూ బెదిరింపు రాతలకు దిగుతోంది. ప్రజల పక్షాన వాస్తవాలు ఎలుగెత్తి చాటే ‘వీ6–వెలుగు’ లాంటి బాధ్యతాయుత మీడియాపై అడ్డగోలు కూతలు కూస్తోంది. 

మీరు బాకా ఊదినవే నిజాలైతే.. కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్ల కోసం, హాస్పిటళ్లలో బెడ్ల కోసం, శ్మశానాల్లో స్లాట్ల కోసం జనం ఎందుకు తండ్లాడుతున్నారు? కరోనా బారినపడ్డ పేద కుటుంబాలకు ఫ్రీ ట్రీట్​మెంట్​ ఇవ్వాలనే సోయిని ప్రభుత్వ పెద్దలు ఎందుకు మర్చిపోయారు? సెక్రటేరియట్ బిల్డింగ్​ కట్టేందుకు ఉన్న తొందరలో సగమైనా హాస్పిటళ్లలో ఫెసిలిటీస్​కల్పించడంపై ఎందుకు చూపడం లేదు? ఇన్ని నెలలుగా ఆయుష్మాన్​భారత్​  స్కీమ్​లో చేరకుండా ప్రభుత్వం ఎందుకు నానుస్తోంది? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ఎందుకు తప్పించుకుంటోంది? సర్కారు దవాఖానల్లో అద్భుతమైన  సౌలత్​లుంటే  సామాన్యులు కూడా ప్రైవేటు హాస్పిటళ్లలో లక్షలకు లక్షల ఫీజులు కట్టి ఎందుకు ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నట్టు? కావాల్సినన్ని  మందులు, ఇంజక్షన్లు, ఆక్సిజన్​ సిలిండర్లు ఉంటే  ‘‘ప్లీజ్​ సార్​..  ఒక్క రెమ్డిసివిర్​ ఇంజక్షన్​ ఇప్పించండి.. ఒక్క ఆక్సిజన్​ సిలిండర్​ ఇప్పించండి.. ప్రైవేట్​ఆసుపత్రుల్లో ఈ ఫీజుల మోత చూడండి.. ’’ అని​ జనం పోటీపడి మినిస్టర్లకు ఎందుకు ట్వీట్లు చేస్తున్నారు? ‘ఆస్క్​ కేటీఆర్​’ అన్న ఐటీ మంత్రికి తమ ఫిర్యాదులతో పబ్లిక్​ ఎందుకు చుక్కలు చూపించినట్లు? ఇవన్నీ సరే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులపై టీఆర్​ఎస్​లీడర్లే సర్కారును ఎందుకు కడిగి పారేస్తున్నట్టు?  ‘సర్కారు దవాఖాన్లకు పోతే సచ్చిపోవుడే ’ అని ఎందుకు సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నట్టు?  సిద్దిపేట హాస్పిటల్​లో ఎవరూ పట్టించుకోక తన తల్లి ప్రాణం పోయిందంటూ తల్లడిల్లిన టీఆర్​ఎస్​ లీడర్​పై కేసు పెట్టిన ఘనత ఎవరిది? కనీసం వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు ఏం బదులిస్తారు?

ఆక్సిజన్​ అందితే అమ్మ బతికేది

అధికార టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ లీడర్ గా ఉండి కూడా మా అమ్మను కాపాడు కోలేకపోయిన. మా అమ్మ బిపాషాకు  కరోనా సోకడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా​ సెంటర్​లో చేర్పించిన.  సరైన ట్రీట్​మెంట్​ చేయలే. ఆక్సిజనూ సరిగ్గా పెట్టకపోవడంతో చేర్పించిన ఐదో రోజే అమ్మ చనిపోయింది. సరైన ట్రీట్​మెంట్​ ఇస్తే అమ్మ బతికేది. అమ్మ చనిపోయిన రోజూ సిబ్బంది మాకు సమాచారం ఇవ్వలేదు. పొంతనలేని సమాధానం చెప్పడంతో నా అనుచరులతో కలిసి ఆసుపత్రి లోపలికి పోయేసరికి అమ్మ చనిపోయి కనిపించింది. ఆమె పక్కనే ఉన్న సిలిండర్​లో ఆక్సిజన్​ అయిపోయింది. ఆక్సిజన్​లేకే చనిపోయిందని స్టాఫ్​ను నిలదీస్తే నాపై ఉల్టా కేసు పెట్టిన్రు.
- ఎండీ మునీర్ పాషా, 
టీఆర్ఎస్  మైనార్టీ సెల్ టౌన్ లీడర్,  సిద్దిపేట

టీఆర్ఎస్ లో ఉండి నాన్నను కాపాడుకోలేకపోయిన

నేను 2006 నుంచి టీఆర్​ఎస్​లో  ఉంటున్న. ఉద్యమంలో, ఎన్నికల్లో ముందుండి పనిచేసిన.  మా నాన్నకు కరోనా వస్తే ప్రభుత్వంపై నమ్మకంతో సిద్దిపేటలోని సర్కారు దవాఖాన్ల చేర్పించిన. కొవిడ్​ వార్డులో జాయిన్​ చేసుకున్నరు. కానీ ట్రీట్​మెంట్​సరిగ్గా చేయలే. అసలు 45 ఏండ్లు దాటినోళ్లకు అక్కడ ఆక్సిజన్​, వెంటిలేటర్లు పెడ్తలేరు. స్వయంగా డాక్టరే ఈ విషయం చెప్పిండు. నా దగ్గర పైసలు లేక కాదు, సిద్దిపేట దవాఖాన్ల ఆక్సిజన్ అందక, వెంటిలేటర్లు దొరక్క మా నాయన చచ్చిపోయిండు. పార్టీ ముఖ్యమనుకొని కాళ్లు చేతులు అరగదీసుకుని టీఆర్ఎస్​కు ఊడిగం చేస్తే నాకు దుఃఖమే మిగిలింది. ఈ ఒక్క హాస్పిటల్​లోనే రోజుకు 30 మంది దాక చచ్చిపోతున్నరు. శవాలను దాచిపెట్టడమే ఇక్కడ అభివృద్ది. మీకు కూడా చెప్తున్నా.. కరోనాతో సర్కారు దవాఖన్లకు పోతే సచ్చిపోవుడే. 
- గడ్డమీది జీవన్ రాజు, టీఆర్ఎస్  లీడర్,  సిద్దిపేట

కష్టకాలంలో లీడర్లు పట్టించుకోలే

నేను మొదటి నుంచి టీఆర్​ఎస్​లో పనిచేస్తున్న. ఇటీవల కార్పొరేషన్​ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఇల్లిల్లు తిరిగి కరోనా తెచ్చుకున్న. ఆక్సిజన్​ అందక ఊపిరి తీసుకోలేని పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో గెలిచేదాక నన్ను వెంట తిప్పుకున్న లీడర్లు నాకు కరోనా రాగానే కనిపించకుండా పోయిన్రు. మంచి ట్రీట్​మెంట్​  చేయించాలని ఒకరిద్దరు లీడర్లను సాయం కోరితే పట్టించుకోలేదు. చివరికి చేసేదేం లేక మా కుటుంబసభ్యులు ఎంజీఎంలో చేర్పించారు. కానీ హాస్పిటల్​లో పరిస్థితి దారుణంగా ఉంది. స్టార్టింగ్​లో ఆక్సిజన్ దొరకలేదు. సెలైన్ కూడా సరిగ్గా పెట్టలేదు. చాలా బ్లడ్ పోయింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. మళ్లీ లీడర్లకు ఫోన్​ చేసి బతిమిలాడిన. కానీ ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు.
- కంప వినోద్, టీఆర్​ఎస్​ లీడర్​, వరంగల్

సొంత పార్టీవాళ్లే తిడుతున్నరు

‘‘సాగర్​ ఎన్నికల వల్ల మా పెద్దవూర మండలంలో ఇప్పుడు ఏ ఊరిలో చూసినా, ఏ ఇల్లు చూసినా  కరోనా బాధితులే కనిపిస్తున్నరు. బెడ్​ దొరికితే చాలు భగవంతుడా అనుకుంట wనల్గొండకు, హైదరాబాద్​లోని​ హాస్పిటళ్లకు పోతున్నరు. నేను అష్టకష్టాలు పడి హైదరాబాద్​లో ఒక్క బెడ్​ దొరకిచ్చుకున్న. మండలంలో కనీసం 40వేల నుంచి 50వేల మంది ఉంటే ఇప్పటివరకు 5 వేల టెస్టులు కూడా చేయలే.  రాష్ట్రంలో హెల్త్​ ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది.  నేను ఇలా నా బాధను చెప్పుకుంటున్నానుగానీ, మిగిలిన టీఆర్ఎస్​ కార్యకర్తలు, నాయకులైతే టీఆర్​ఎస్​ పార్టీని బూతులు తిడుతున్నరు. నా కండ్ల ముందే మన పార్టీని, గవర్నమెంట్​ను తిడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్న..
- ఈ నెల 9న హాస్పిటల్​లో బెడ్​ మీది నుంచి సెల్ఫీ వీడియాలో నల్గొండ జిల్లా టీఆర్​ఎస్​ నేత మిట్టపల్లి శ్రీనివాస్