రాహుల్ గాంధీకి తిరిగి ఎంపీ పదవి ఎలా వస్తుంది? కండీషన్స్ ఎంటీ?

 రాహుల్ గాంధీకి తిరిగి ఎంపీ పదవి ఎలా వస్తుంది? కండీషన్స్ ఎంటీ?

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.  సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో  రాహుల్ తిరిగి తన పార్లమెంటు సభ్యత్వాన్ని పొందనున్నారు. ఏ ఎంపీకైనా కోర్టు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించినప్పుడు అతను లేదా ఆమె పార్లమెంటు సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది. ఒకవేళ కోర్టు నుండి ఉపశమనం పొందినట్లయితే పునరుద్ధరించబడుతుంది. అయితే.. రాహుల్ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. సభ్యత్వ పునరుద్ధరణ గురించి తెలియజేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ  చేయాలి.  కొన్నిసార్లు దీనికి నెలలు సమయం కూడా పట్టొచ్చు.  లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే రాహుల్ పార్లమెంట్ లో అడగుపెట్టగలరని నిపుణులు చెబుతున్నారు. 

లోక్‌సభ సెక్రటేరియట్‌లో పార్లమెంటులో తన  సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని రాహుల్ గాంధీ ఎంత త్వరగా విజ్ఞప్తి చేస్తే అంత త్వరగా తన ఎంపీ పదవిని తిరిగి పొందే అవకాశం ఉందంటున్నారు. రాహుల్ విజ్ఞప్తిపై ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారనేది లోక్‌సభ సెక్రటేరియట్‌పైనే ఆధారపడి ఉంటుంది. లోక్‌సభ సెక్రటేరియట్‌లో తన అప్పీలు విచారణలో కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగితే.. దీని కోసం రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా ఉంది.  

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ ఓ హత్యాయత్నం కేసులో 2023 జనవరిలో సెషన్స్ కోర్టులో దోషిగా తేలింది. కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, 13 జనవరి 2023న, లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. కానీ.. ఫైజల్  జనవరి 25న కేరళ హైకోర్టుకు వెళ్లి శిక్షపై స్టే తెచ్చుకున్నారు.  దీని తర్వాత ఫైజల్ లోక్‌సభ సెక్రటేరియట్ నుండి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయినా అనర్హత వేటు తీయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  అనంతరం లోక్‌సభ సెక్రటేరియట్ ఫైజల్  పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించింది.  

రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంతో ఆయన తుగ్లక్ రోడ్డులోని బంగ్లాను కూడా ఖాళీ చేశారు. ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరించబడిన తర్వాత రాహుల్ తిరిగి అదే బంగ్లాను కేటాయిస్తారా..? అనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంపీల ప్రభుత్వ బంగ్లాను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ కేటాయిస్తుంది.  లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు నివాసాల కేటాయింపు కోసం హౌస్ కమిటీ కూడా ఉంది. అదే కమిటీ బంగ్లాల కేటాయింపు కోసం మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుంది.  కాబట్టి.. రాహుల్ కు తిరిగి అదే బంగ్లాను కేటాయించాల్సిన అవసరం ఉండొచ్చు. ఉండకపొవచ్చు.