సెలెక్టయి ఏడాదైనా ట్రైనింగ్ ఇవ్వరా..

సెలెక్టయి ఏడాదైనా ట్రైనింగ్ ఇవ్వరా..

ఆందోళనకు దిగిన టీఎస్‌ఎస్పీ క్యాండిడేట్లు

హైదరాబాద్ లో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు

ట్రైనింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్న అడిషనల్‌ డీజీ

హైదరాబాద్‌, వెలుగు: సెలెక్ట్‌ అయి ఏడాది కావస్తున్నా ట్రైనింగ్‌ ఇవ్వడం లేదంటూ టీఎస్‌ స్పెషల్ పోలీస్‌ క్యాండిడేట్లు ఆందోళనకు దిగారు. బుధవారం చలో డీజీపీ ఆఫీస్ పిలుపునిచ్చిన వారిని.. పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్యాండిడేట్లను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. సిటీలోని రాంగోపాల్‌ పేట్, ముషీరాబాద్‌, గోషామహల్ పోలీస్‌ స్టేడియం, నాంపల్లి పీఎస్‌లకు తరలించారు. ట్రైనింగ్‌ తేదీలను వెంటనే ప్రకటించాలని క్యాండిడేట్లు డిమాండ్‌ చేశారు.

డీజీపీ ఆఫీస్ హామీ!

క్యాండిడేట్లు ఆందోళన చేయడంతో డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. నలుగురిని డీజీపీ ఆఫీస్ కు పిలిపించి అడిషనల్‌ డీజీ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది.ఆర్మ్ డ్ రిజర్వ్‌, సివిల్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్‌తో ట్రైనింగ్‌ సెంటర్స్‌ లో సమస్యలు తలెత్తినట్లు అధికారులు చెప్పినట్లు సమాచారం. సర్వీస్‌, శాలరీ విషయంలో డిపార్ట్‌ మెంట్‌ తగిన నిర్ణయం తీసుకుంటుందని అడిషనల్‌ డీజీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అక్టోబర్ లాస్ట్‌ వీక్ లో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ ట్రైనింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించినట్లు తెలిసింది.

సర్వీస్ నష్టపోతం

4,834 టీఎస్ఎస్పీ పోస్టుల భర్తీకి 2018 మేలో నోటిఫికేషన్ ఇవ్వగా.. 4,203 మంది సెలెక్ట్‌ అయ్యారు. ఇదే రిక్రూట్ మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన సివిల్, ఆర్మ్ డ్ రిజర్వ్‌ క్యాండిడేట్లకు జనవరి 17 నుంచే ట్రైనింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. ఒకే నోటిఫికేషన్ తో సెలెక్ట్‌ అయినా.. ట్రైనింగ్‌లో ఆలస్యం వల్ల తాము సర్విస్‌ నష్టపోతామని టీఎస్‌ఎస్పీ క్యాండిడేట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెలెక్ట్‌ అయిన క్యాండిడేట్లలో ఇద్దరు రోడ్‌ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఒకరు ఎలక్ట్రిక్ షాక్ తో, మరొకరు కాలు విరిగి గాయపడ్డారు.

 

బీటెక్ పూర్తి చేశాను. టీఎస్‌ఎస్పీకి సెలెక్ట్‌ అయ్యాను. నాకు ఈ నెల 6న బైక్ యాక్సిడెంట్‌ అయ్యిం ది. కాలుకి 45 కుట్లు పడ్డాయి. ఇప్పటికే ట్రైనింగ్‌ స్టార్ట్‌ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. – అంజన్న, టీఎస్‌ఎస్పీ అభ్యర్థి, మంచిర్యాల.

ఈ మధ్య ఒకరి ఇంట్లో పవర్ సప్లయ్‌ ప్రాబ్లమ్‌ రావడంతో కరెంట్‌ పోల్‌ ఎక్కాను. షాక్‌ కొట్టి పోల్‌ పై నుంచి కింద పడ్డాను. ఫేస్‌ కాలిపోయింది. కుడి భుజం బోన్‌ ఫ్యాక్చర్‌‌ అయ్యింది. నేకు అకాడమీ ట్రైనింగ్ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు.  –వీరబాబు, టీఎస్‌ఎస్పీ అభ్యర్థి, నాగుపల్లి, కొత్తగూడెం జిల్లా.

 

టీఎస్‌ఎస్పీ క్యాండి డేట్ల డిమాండ్లు‌:

ట్రైనింగ్‌ తేదీలను వెంటనే ప్రకటించాలి

ఒకే నోటిఫికేషన్, ఒకే సెలక్షన్‌ జరగాలి

కోల్పోయిన సర్వీస్‌ పీరియడ్‌ను ట్రైనింగ్‌లో కలపాలి

పూర్తి జీతంతో కూడిన ట్రైనింగ్‌ ఇవ్వాలి

చనిపోయిన, గాయాలైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.