జీవో ఇచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం

 జీవో ఇచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  • కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు డెడ్ లైన్ పెట్టిందని నిరుడు జీవో విడుదల
  • ఏడాది దాటినా ఆఫీసు కేటాయించలేదు.. -ఫిర్యాదులు తీసుకునుడు లేదు

హైదరాబాద్, వెలుగు: చట్టాన్ని అతిక్రమించే, దుర్వినియోగం చేసే పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం పోలీస్ కంప్లయింట్స్ అథారిటీల ఏర్పాటుకు జీవో ఇచ్చింది. కానీ, ఇప్పటికీ వాటిని ఏర్పాటు చేయనే లేదు. కేవలం జీవోకే పరిమితమైంది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ విలాస్ వి.అఫ్జల్ పుర్కర్ చైర్మన్ గా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వి.నవీన్ చంద్ సభ్యుడిగా, అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్) మెంబర్ సెక్రటరీగా ఏర్పాటైన స్టేట్ పోలీస్ కంప్లయింట్స్ అథారిటీకి ఇప్పటి వరకు ఆఫీసు, చైర్, టేబుల్ కూడా ఏర్పాటు చేయలేదు. రిటైర్డ్ జిల్లా జడ్జిలు కె.సంగారెడ్డి, ఎం.వెంకటరామారావు చైర్మన్లుగా హైదరాబాద్, వరంగల్ రీజియన్లలో ఏర్పాటైన డిస్ట్రిక్ట్ అథారిటీలది అదే పరిస్థితి. అథారిటీ అధికారాలు, విధులకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించకపోవడంతోనే ఫిర్యాదుల స్వీకరణ మొదలుకాలేదని తెలిసింది. 

16 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు డైరెక్షన్​.. 

విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో రిటైర్డ్ జడ్జిలతో  పోలీస్ కంప్లయింట్​అథారిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు16 ఏళ్ల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. కానీ, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. పోలీస్​కంప్లయింట్​అథారిటీ, స్టేట్ సెక్యూరిటీ కమిషన్​ ఏర్పాటుపై 2017లో రాష్ట్ర హైకోర్టులో సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు(2209/2017) నమోదైంది. 2021 జులై 9న ఈ కేసు విచారణకు రానుండగా రాష్ట్ర ప్రభుత్వం అథారిటీలను ఏర్పాటు చేస్తూ రెండు రోజుల ముందు జీవో జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు డెడ్ లైన్​విధించడంతో.. అథారిటీలను ఏర్పాటు చేశామని చూపించుకునేందుకే హడావుడిగా ఈ జీవో విడుదల చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అస్సాం, చండీగఢ్​, ఢిల్లీ, హర్యానా, కర్నాటక, కేరళ, పంజాబ్​ తదితర రాష్ట్రాల్లో రిటైర్డ్ జడ్జిలతో కూడిన పోలీస్​కంప్లయింట్​ అథారిటీలు సమర్థంగా పని చేస్తుండగా రాష్ట్రంలో మాత్రం కాగితాలకే పరిమితమైంది. 

స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటులో నిర్లక్ష్యమే.. 

ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పోలీస్ సంస్కరణల్లో మన రాష్ట్రం వెనుకబడిపోయింది. రాష్ట్ర పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వ అనవసర పెత్తనం, ఒత్తిడి లేకుండా ఉండేందుకు స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీం కోర్టు 2006లోనే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ కమిషన్ లో సీఎం లేదా హోం మినిస్టర్​చైర్​పర్సన్​గా, డీజీపీ ఎక్స్​అఫీషియో సెక్రటరీగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, సీఎస్, హైకోర్టు చీఫ్​జస్టిస్ నామినేట్ చేసిన రిటైర్డ్ జడ్జి, ముగ్గురి నుంచి ఐదుగురు నాన్​ పొలిటికల్ మెంబర్స్​సభ్యులుగా ఉంటారు. నాన్​ పొలికటికల్ మెంబర్స్​ప్రభుత్వ నియంత్రణలో కాకుండా ఇండిపెండెంట్ గా పని చేయగలిగినవారై ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసుల పనితీరును అంచనా వేయడం, పోలీసింగ్ కు సంబంధించి పాలసీలు రూపొందించడం, అసెంబ్లీకి వార్షిక నివేదికలు సమర్పించడమే స్టేట్ సెక్యూరిటీ కమిషన్​విధిగా వెల్లడించింది.
ఎస్టాబ్లిష్​మెంట్ బోర్డు పెట్టేదెన్నడో? 

రాజకీయ ఒత్తిళ్లు లేకుండా డీఎస్పీ, అంతకన్నా తక్కువ హోదా కలిగిన పోలీస్​ అధికారులు, కానిస్టేబుళ్ల పోస్టింగ్స్​, ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు జరిగేందుకు డీజీపీ, నలుగురు పోలీస్​ ఆఫీసర్లతో పోలీస్ ​ఎస్టాబ్లిష్​మెంట్ బోర్డు(పీఈబీ)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్కారు ఈ బోర్డు నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. కానీ రాష్ట్రంలో ఎస్సైలు మొదలు డీఎస్పీ కేడర్​దాకా అన్ని పొలిటికల్ పోస్టింగ్​లే నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే, మంత్రుల రెకమండేషన్​ లెటర్లు ఉంటేనే ఆయా నియోజకవర్గాల్లో పోస్టింగ్ ​ఇస్తున్నారనే విమర్శలున్నాయి.