ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చర్యలేవి? : తెలంగాణ

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చర్యలేవి? : తెలంగాణ

కేఆర్‌‌ఎంబీ తీరుపై తెలంగాణ ఫైర్​

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై 40కి పైగా ఫిర్యాదులు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్‌‌ఎంబీ)ని తెలంగాణ ప్రశ్నించింది.ఇరిగేషన్‌‌ ఈఎన్సీ(జనరల్‌‌) మురళీధర్‌‌ కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ ఎంపీ సింగ్‌‌కు బుధవారం లేఖ రాశారు. అనుమతులు లేకుండా ఏపీ సర్కారు అనేక కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు ఉన్న ప్రాజెక్టులను విస్తరిస్తోందని, వీటిపై తాము అనేక లేఖల ద్వారా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో కృష్ణా బేసిన్‌‌లోని తెలంగాణ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేఆర్‌‌ఎంబీ 15వ మీటింగ్‌‌లో ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులన్నీ బోర్డు అధీనంలోకి తేవాలని తాము డిమాండ్‌‌ చేస్తే 15 కంపోనెంట్ల నిర్మాణం ఆపేయాలని ఆదేశించారని తెలిపారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కంప్లైంట్‌‌ చేశారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ (కేడబ్ల్యూడీటీ -1) అవార్డును అతిక్రమించి కృష్ణా నీటిని వేరే బేసిన్‌‌కు మళ్లిస్తోందన్నారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా ఇవ్వాలని కోరుతూ బ్రజేశ్‌‌ ట్రిబ్యునల్‌‌ (కేడబ్ల్యూడీటీ -2 ) ఎదుట తాము వాదనలు వినిపిస్తున్నామన్నారు. కేఆర్‌‌ఎంబీ, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి లేకుండా, ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌ను అతిక్రమించి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపి వేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఏపీ ఉల్లంఘనలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని సూచించారు.