భద్రాద్రి మాస్టర్​ ప్లాన్​ ఏమాయె?

భద్రాద్రి మాస్టర్​ ప్లాన్​ ఏమాయె?

సీఎం హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా మొదలు కాని పనులు

అభివృద్ధి చేయడానికి భూమి చూపాలన్న ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ మాటలతో పనులపై భక్తుల్లో అనుమానాలు

భద్రాచలం, వెలుగు: ‘ఎన్ని కోట్లు ఖర్చయినా సరే.. భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేసి తీరతాం. భద్రాద్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అంటూ 2015 మార్చి 28న సీఎం కేసీఆర్‍ మణుగూరులో  పేర్కొన్నారు. 2017–18  బడ్జెట్‍లో భద్రాచలం రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. అంతకుముందే నాటి ఆర్‍అండ్‍బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, త్రిదండి చినజీయర్‍స్వామి,ఆర్కిటెక్ట్​ఆనందసాయి, స్థపతి వల్లీనాయగన్‍ హెలీకాప్టర్‍లో భద్రాచలం వచ్చి ఆలయ అభివృద్ధిపై వేదపండితులతో చర్చించారు. మాస్టర్‍ప్లాన్‍ రూపొందించారు. 2020 వచ్చింది కానీ నేటికీ ఆ మాస్టర్‍ ప్లాన్‍ అమలుకు నోచుకోవడం లేదు. రామాలయం అభివృద్ధిపై ఇప్పుడు తెలంగాణ సర్కారు మాట మారుస్తున్నట్లుగా భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం భద్రాచలం వచ్చిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రెస్‍మీట్‍లో భద్రాచలం రామాలయం అభివృద్ధి గురించి పెదవి విప్పారు.

రూ.100 కోట్లు రాలేదంటూ గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలు, పత్రికలు అసలు అభివృద్ధి చేయడానికి భూమి ఎక్కడ ఉందో చూపాలన్నారు. ఆలయం చుట్టూ ఉన్నవారిని ఖాళీ చేయిస్తే వారికి ఇళ్లు ఎక్కడ కట్టించాలని ప్రశ్నించారు. ఈ మాటలతో భద్రాచలం రామాలయాన్ని తెలంగాణ సర్కారు అభివృద్ధి చేస్తుందా లేదా అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. భూమి లేదనే విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా.. మరి మాస్టర్​ప్లాన్​ఎలా తయారు చేశారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్ తో 7 మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. కనీసం పిచ్చుకులపాడు, గుండాల, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం ఐదు పంచాయతీలనైనా తీసుకొస్తే కావసినంత భూమి దొరుకుతుంది కదా అంటే ప్రస్తుతం పక్క రాష్ట్రంలో అంతగా సఖ్యత లేదని ప్రజాప్రతినిధులు అంటున్నారు.

జగమేలే స్వామికి జగమంతా ఆస్తులే..

జగమేలే రామయ్య స్వామికి జగమంతా ఆస్తులే. కానీ వాటిపై పైసా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. భక్తులు కానుకగా ఇచ్చిన భూముల విలువే రూ.500 కోట్ల నుంచి రూ.1000కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆంధ్రాలో విలీనమైన పురుషోత్తపట్నంలో 917 ఎకరాలు భూములు ఉండగా, ఇందులో సింహభాగం ఆక్రమణలే.  గుంటూరు జిల్లా చిన్నపాలెంలో 2.5 ఎకరాలు, బొమ్మడిలో ఎకరం, కండ్రిగ అగ్రహారంలో 3.85 ఎకరాలు దేవుని మాన్యం ఆక్రమణకు గురయ్యాయి.

ఆలయ సమీపంలోని బూర్గంపాడు మండలం  సీతారామనగరంలో 18 ఎకరాలు, దుమ్ముగూడెం మండలం కాశీనగరంలో 2.67 ఎకరాలు, లక్ష్మీనర్సాపురంలో 20 ఎకరాలు,  ఎటపాక మండలం చోడవరంలో అర ఎకరం, రాచగొంపల్లిలో 3.32 ఎకరాలు, కాపుగొంపల్లిలో 4 ఎకరాలు, కాపవరంలో ఎకరం, ములకలపల్లి మండలంలో 4 ఎకరాలు, అశ్వాపురం మండలం  నెల్లిపాక బంజరలో 6.25 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో 88 సెంట్లు, వీరవల్లిలో అర ఎకరం, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో 10 సెంట్లు, తర్లపాడులో 4.2 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. కృష్ణా జిల్లా  విశ్వనాథపల్లిలో 1.99 ఎకరాలు, మాగళ్లలో 4.57 ఎకరాలు ఉన్నాయి. కాగా గుంటూరు జిల్లా  పొన్నూరులో 6.66 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 2.03 ఎకరాలు, విశాఖ జిల్లాలో 3.93 ఎకరాలు అమ్మేశారు. తెలుగు రాష్ట్రాల్లో రామయ్యకు భూములు ఉన్నా ఆదాయం వచ్చే పరిస్థితి కన్పించడం లేదు.  భక్తుల విరాళాల రూపంలో స్వామికి ఇచ్చిన బంగారం 30 కిలోలు, వెండి 608 కిలోలు ఉంది.

ఆలయ ఆధారిత పర్యాటకం

శ్రీరామ దివ్యక్షేత్రం ఆలయ ఆధారిత పర్యాటక ప్రాంతం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. భద్రాచలం వస్తే సమీపంలో పర్ణశాల, ఆంధ్రాలో విలీనమైన పాపికొండలు, పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యం, బోటు షికారు, జింకల పార్కు, వైరా రిజర్వాయర్‍, నేలకొండపల్లి బౌద్ధ స్తూపాలు, జమలాపురం వేంకటేశ్వరస్వామి, నాచారం  వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఇలా అనేకం ఉన్నాయి. కొత్తగూడెం వరకు రైలు మార్గం ఉంది.

కానీ భద్రాచలంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నానాటికీ ఈ పర్యాటక ప్రాంతం కునారిల్లుతోంది.  ముందుగా భద్రాచలం మాస్టర్‍ప్లాన్‍ ఆచరణకు నోచుకుంటేనే ఆలయంతోపాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్న సర్కారు భద్రాద్రిపైనా దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

అమలుకు నోచని మాస్టర్​ప్లాన్​

ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు వైఎస్‍. రాజశేఖర్‍రెడ్డి హయాంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి బీజం పడింది. ఆయన అకాల మరణంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆలయం మాడవీధుల అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించారు. 20 ఇళ్లను తొలగించాలని భూసేకరణ చేపట్టారు. 7 ఇళ్లు తొలగించాక, తమకు పునరావాసం కల్పించాలని, ప్యాకేజీ సరిపోదని మిగిలిన 13 ఇళ్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. అక్కడితో ఆ మాస్టర్‍ప్లాన్‍ ఆగింది.

తెలంగాణ కొత్త రాష్ట్రంలో శ్రీరామ దివ్యక్షేత్రం దశ మారిపోతుందని అంతా ఆశించారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‍ ప్రకటించడంతో మాస్టర్‍ప్లాన్‍ రూపకల్పనకు బాటలు పడ్డాయి. త్రిదండి చినజీయర్‍స్వామి, ఆర్కియాలజిస్టు ఆనందసాయి పర్యవేక్షణలో ఆలయంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. చుట్టూ ప్రాకారాలు, మాడవీధి, 1000 కాళ్ల మండపం… ఇలా శిల్పకళా శోభితంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 65 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు రెడీ అయ్యారు.

అదే సమయంలో  9 నెలల ముందే ప్రభుత్వం రద్దు కావడం, ముందస్తు ఎన్నికలు రావడంతో తిరిగి మాస్టర్‍ప్లాన్‍ కథ మూలకెళ్లింది. రెండోసారి టీఆర్‍ఎస్‍ అధికారంలోకి రావడంతో మాస్టర్‍ప్లాన్‍పై మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఏడాది పాలన ముగిసినా మాస్టర్‍ప్లాన్‍ విషయంలో సర్కారు నుంచి ఉలుకు పలుకు లేదు. తాజాగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.