మోదీ ప్రచారం చేసిన చోటల్లా మేమే గెలిచాం : శరద్​ పవార్​

మోదీ ప్రచారం చేసిన చోటల్లా మేమే గెలిచాం : శరద్​ పవార్​
  •      ప్రధానికి కృతజ్ఞతలు 

ముంబై: ప్రధాని మోదీ మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్నిచోట్లలో తాము గెలిచామని నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ) చీఫ్​శరద్​పవార్​ అన్నారు. ‘మహా వికాస్​ అఘాడీ’ (ఎంవీఏ)కు రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మార్చిన మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చురకలంటించారు. శనివారం ఆయన ఎంవీఏ నేతలు ఉద్ధవ్ ఠాక్రే, పృథ్వీరాజ్ కపూర్ తో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా పవార్​ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎక్కడైతే రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో అక్కడ తమ కూటమి విజయం సాధించిందని వివరించారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో చీలికలు ఏర్పడి, అజిత్​పవార్​ నేతృత్వంలోని ఎన్సీపీ, ఏక్​నాథ్​ షిండే నేతృత్వంలోని శివసేన.. బీజేపీతో చేతులు కలిపాయి. అయినా.. ఈ ఎన్నికల్లో  బీజేపీ కేవలం 9 సీట్లకే  పరిమితమైంది. 

2019లో బీజేపీ 23 సీట్లలో విజయం సాధించగా.. ఈ సారి ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది. మోదీ ప్రచారం చేసిన మెజారిటీ సీట్లలో ఎన్డీయే ఈసారి ఓటమి చవిచూసింది. 18కి పైగా లోక్‌సభ స్థానాల్లో ఆయన ప్రచారం చేస్తే 3 సీట్లలో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ, మోదీపై పవార్​ సెటైర్లు వేశారు. 

ఎంవీఏ గెలుపు ఆరంభమే..: ఉద్ధవ్ థాక్రే

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ(ఎంవీఎ) విజయం ఆరంభమేనని.. అంతం కాదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి సహకరించిన ప్రజలతోపాటు సిటిజన్​ గ్రూప్స్, మీడియా, యూట్యూబ్​ చానెల్స్​కు కృతజ్ఞతలు తెలిపారు. తనను వదిలివెళ్లినవారిని తిరిగి పార్టీలోకి తీసుకునేదిలేదని ఆయన తేల్చి చెప్పారు.