నాలాల వైడెనింగ్ పూర్తయ్యేనా?

నాలాల వైడెనింగ్ పూర్తయ్యేనా?
  • ఫండ్స్​ ఉన్నా పనుల్లో కనిపించని స్పీడ్  
  • కొన్ని చోట్ల ఆస్తుల సేకరణకూ ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: వానకాలం నాటికి  నాలాల వైడెనింగ్​ పూర్తయ్యేలా కనిపిస్తలేదు. మొన్నటి వరకూ నిధులు  లేకపోవడంతో పనులు సాగలేదు. ఇప్పుడు ఫండ్స్​ ఉన్నా స్పీడ్​గా చేస్తలేరు. వానలు  ఎక్కువ కురిసినా  ఇబ్బందులు ఉండబోవని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్​ చెప్తున్నప్పటికీ ఆ దిశగా పనులు జరగడం లేదు. నాలాలకు సంబంధించి  ప్రత్యేకంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్​ప్లాన్​(ఎస్​ఎన్డీపీ) ని ఏర్పాటు చేసినప్పటికీ  ఫలితం కనిపిస్తలేదు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో మొత్తం నాలాలు 173 ఉన్నాయి. వాటి  పొడవు 391 కిలోమీటర్లు ఉంది. వీటి వైడెనింగ్​ కోసం  కోసం రూ.858 కోట్లను ఖర్చు చేసేందుకు  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో గ్రేటర్ పరిధిలోని నాలాల కోసం  రూ.633 కోట్లు ఉండగా, మిగతావి చుట్టుపక్కల మున్సిపాలిటీల కోసం ఉన్నాయి.  జోన్​కి ఒక్కో నాలాని ముందుగా విస్తరిస్తున్నట్లు చెప్తున్న అధికారులు ఆ పనులు కూడా స్లోగానే చేస్తున్నారు. మరోవైపు ఆస్తుల సేకరణా పూర్తికాలేదు.  ఫస్ట్​ ఫేజ్​లో జీహెచ్‌‌ఎంసీ పరిధిలో రూ.633కోట్లతో 30 పనులు, ఓఆర్‌‌ఆర్‌‌ పరిధిలో లోపల ఉన్న మున్సిపాలిటీలలో రూ.225 .12 కోట్లతో 22 పనులు చేపట్టనున్నట్లు నెల కిందట మంత్రి కేటీఆర్ చెప్పారు.  కానీ, ఇందులో కేవలం ఐదారు నాలాల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. నాలాల పనులు త్వరగా పూర్తి చేయాలంటూ పలుచోట్ల ప్రతిపక్ష నేతలు ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. 


400 మందికి నోటీసులు


నాలాల వైడెనింగ్​ కోసం ఆస్తుల సేకరణ కొనసాగుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన హుస్సేన్ సాగర్ సర్ ప్లస్​నాలా పనులు అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతున్నాయి.  కవాడిగూడ నుంచి అశోక్ నగర్ బ్రిడ్జి వరకు దాదాపు 400 మందికిపైగా నోటీసులు జారీ చేశారు. అభ్యంతరాలు తెలిపేందుకు కూడా ఈ నెల 7న ఆఖరు వరకు అనుమతి ఇచ్చారు.  ఈ నాలాకు సంబంధించి కేవలం 20 ఆస్తులు మాత్రమే పోయేలా ప్లాన్​ చేసినట్లు కేటీఆర్ చెప్పినప్పటికీ అధికారులు మాత్రం వందలాది మందికి నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది. కవాడిగూడ బ్రిడ్జి నుంచి గాంధీ నగర్‌‌ బ్రిడ్జి వరకు, గాంధీ నగర్‌‌ బ్రిడ్జి నుంచి అశోక్‌‌ నగర్‌‌  బ్రిడ్జి వరకు, అశోక్‌‌ నగర్‌‌  బ్రిడ్జి నుంచి  హిమాయత్‌‌ నగర్‌‌ బ్రిడ్జి వరకు రూ. 33 కోట్ల15  లక్షలతో మొదటి ప్యాకేజీ,  హిమాయత్‌‌ నగర్‌‌  బ్రిడ్జి నుంచి చిక్కడపల్లి బ్రిడ్జి వరకు, చిక్కడ పల్లి బ్రిడ్జి నుంచి బాగ్‌‌ లింగంపల్లి బ్రిడ్జి వరకు, బాగ్‌‌ లింగంపల్లి బ్రిడ్జి నుంచి నల్లకుంట బ్రిడ్జి వరకు, నల్లకుంట బ్రిడ్జి నుంచి గోల్నాక బ్రిడ్జి వరకు, గోల్నాక బ్రిడ్జి నుంచి మూసీ నది సంగమం వరకు రెండో ప్యాకేజీ కింద రూ. 35 కోట్ల 25 లక్షలతో పనులు చేయాలని నిర్ణయించారు. కానీ  ఈ పనులన్నీ ఎక్కడికక్కడ స్లోగా సాగుతస్తున్నాయి. 


 ఏటా ఇంతే....


సిటీలో గతంలో సంవ‌‌త్సరాల్లో కురిసిన భారీ వ‌‌ర్షాల‌‌కు   ఎన్నో ప్రాంతాలు మునిగాయి. వరద సమస్యను ఎదుర్కొనేందుకు  నాలాల వైడెనింగ్​ చేస్తామని రెండేళ్ల క్రితం ప్రకటించినప్పటికీ నామమాత్రంగానే చేస్తున్నారు. దీంతో సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. ఈ ఏడాది జూన్ లోపు నాలాల పనులు పూర్తి కావాలని సీఎస్ సోమేశ్ కుమార్​ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి కాకపోతే... ఈ ఏడాది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ముప్పు తప్పేలా లేదు. ఇదే విషయంపై ఎస్​ఎన్డీపీ అధికారులను అడిగితే పనులు చేస్తున్నామని, తొందరలో అవసరమైన అన్నిచోట్ల నాలాలను విస్తరిస్తామని చెప్తున్నారు.


జూన్​లోగా కంప్లీట్ చేయాలి: మేయర్


వచ్చే  వానాకాలంలో వరద ముంపు  లేకుండా మొదటి దశలో చేపట్టిన నాలాల పనులన్నింటిని జూన్​లోగా  పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  అధికారులను ఆదేశించారు. సోమవారం మ్యారియెట్​ హోటల్ నుంచి  ఫీవర్ హాస్పిటల్ వరకు ఎస్​ఎన్ డీపీ ద్వారా పనులు చేపట్టిన సర్ ప్లప్  నాలా  రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను దోమలగూడ వద్ద  ఆమె పరిశీలించారు. అవసరమైన భూసేకరణ పక్రియను  వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో  టౌన్ ప్లానింగ్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.  భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే పనుల చేపట్టాలన్నారు.  

మరిన్ని వార్తల కోసం :

బాబు బడికి వెళ్లు