సభలో సీఎం స్పీచ్ ఇస్తుండగా..బీఆర్ఎస్ నేతల రన్నింగ్ కామెంటరీ

సభలో సీఎం స్పీచ్ ఇస్తుండగా..బీఆర్ఎస్ నేతల రన్నింగ్ కామెంటరీ
  • అడుగడుగునా అడ్డుతగిలిన ప్రతిపక్ష సభ్యులు
  •  రెండు సార్లు వెల్​లోకి దూసుకెళ్లి నినాదాలు

హైదరాబాద్, వెలుగు :   అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగుతున్నంత సేపు బీఆర్ఎస్ సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేశారు. సీఎం ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. బీఆర్ఎస్ సభ్యులు రెండు సార్లు స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లి గట్టిగా నినాదాలు చేశారు. సీఎం రిప్లై తర్వాత క్లారిఫికేషన్స్ కోసం మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పినా వినిపించుకోలేదు. ఒక సందర్భంలో గవర్నర్ స్పీచ్ వింటుంటే సిగ్గు అనిపించిందని కేటీఆర్ అనడంతో.. ఔను నువ్వు సిగ్గు పడాలని రేవంత్ విమర్శించారు. సిగ్గు పడే విషయాలు అన్నీ చెప్తానన్నారు. ఇసుక దోపిడీలో బీఆర్ఎస్ వాటా లేదా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ‘‘నేరేళ్లలో దళితులకు పోలీసులతో కరెంట్ షాకులు పెట్టించారు. సంసార జీవితానికి కూడా పనికి రాకుండా చేశారు. మీరా కుమార్ చూద్దాం అని వస్తే పోలీసులతో అడ్డుకున్నది మీరు.. దానికి సిగ్గు పడు.. ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేసి బేడీలు వేసిన చరిత్ర మీది.. అందుకు సిగ్గు పడు.. సిగ్గుతో తల దించుకో..” అంటూ సీఎం ఫైర్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.  

హరీశ్ కామెంట్లపై దుమారం.. బీఆర్ఎస్ వాకౌట్

క్లారిఫికేషన్స్ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల దుమారం చెలరేగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారని.. ఇప్పుడు కూడా క్లారిఫికేషన్ కేటీఆరే అడగాలని స్పీకర్​ సూచించారు. అయితే తమ పార్టీ నుంచి హరీశ్ రావు మాట్లాడతారని తెలిపారు. దీనికి తొలుత అభ్యంతరం తెలిపిన అధికార పార్టీ, స్పీకర్.. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి సూచనతో హరీశ్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ది కుటుంబ పాలన అని.. నెహ్రూ, రాజీవ్, సోనియా గాంధీ అంటూ కామెంట్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు రెండు, మూడు సార్లు చెప్పినా హరీశ్ తన క్లారిఫికేషన్ కాకుండా చర్చ చేస్తున్నారని స్పీకర్ తప్పుపట్టారు. గవర్నర్​ ప్రసంగాన్ని సభ ఆమోదించినట్లుగా స్పీకర్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మళ్లీ వెల్​లోకి దూసుకెళ్లి ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. వాకౌట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అలాగే నినాదాలు చేసుకుంటూ సభ నుంచి బయటకు వచ్చారు.