- పదేండ్ల పాలనలో రైతులను ఏం ఉద్ధరించారు : విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: వరంగల్ లో బీఆర్ఎస్ రైతు సభ ఎందుకు పెడుతుందో చెప్పాలని విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను ఉద్ధరించింది ఏంటని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేండ్ల తమ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే రైతు అని, రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఏంటో చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలను ఆది శ్రీనివాస్ సవాల్ చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో రైతులు గుర్తించారని, అదే బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉండేనో అందిరికీ తెలిసిందేనని అన్నారు.

