అభ్యర్థులెవరో?.. కాంగ్రెస్, బీజేపీలో నేతల్లో ఉత్కంఠ

అభ్యర్థులెవరో?.. కాంగ్రెస్, బీజేపీలో నేతల్లో ఉత్కంఠ

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పోలింగ్ తేదీకి సరిగ్గా 50 రోజుల గడువు ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగతా నాలుగు చోట్ల కూడా ఎవరు పోటీ చేస్తారనేది హింట్ ఇచ్చింది. దాంతో వారు ఎన్నికల ప్రచార బరిలో నిలిచారు. బీఎస్పీసైతం 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. కానీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కామ్రేడ్లు కాంగ్రెస్ పిలుపు కోసం వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. హస్తం నుంచి పిలుపొస్తే.. సీట్లెన్నో మాట్లాడుకుండామనే ధోరణిలో ఉన్నారు. పలురకాల ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నా హస్తం పార్టీ నుంచి ఆహ్వానం రావడం లేదు. ఇక పోతే నిన్నటి వరకు కాంగ్రెస్ లో విలీనం అవుతుందనుకున్న వైఎస్సార్టీపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 

ముందుకు కదలని కాంగ్రెస్ జాబితా..

చర్చోపర్చలు.. రకరకాల డిమాండ్లు.. విభిన్న సర్వేలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 119 స్థానాల ఆశావహుల నుంచి పీసీసీ దరఖాస్తులు ఆహ్వానించగా వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం తమకు 34 సీట్లు కేటాయించాలని బీసీ నేతలు పట్టుబట్టుతున్నారు. టీం ఓబీసీగా ఏర్పడి అగ్రనేతలను, స్క్రీనింగ్ కమిటీని కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

మరో వైపు మైనార్టీ నేతలు పాతబస్తీ బయట ఆరు సీట్లు కావాలని కోరుతున్నారు. కర్నాటక స్టైల్ లో తమ సత్తా చూపుతామని చెబుతున్నారు. మరో వైపు మహిళా నేతలు తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీకి విన్నవించారు. ఈ పరిణామాల మధ్య కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు మరో డిమాండ్ తెరపైకి తెచ్చారు. తమకు ఎట్టి పరిస్థితిలో 12 సీట్లు కేటాయించాలంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం స్పందించని పక్షంలో తమ వద్ల ప్లాన్ బీ ఉందంటూ మాజీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలోకి కొత్త నేతలు చేరుతుండటంతో డిస్కషన్ మళ్లీ ఎప్పటికప్పుడు మొదటికి వస్తోంది. దీనికి ఇతర పార్టీల నుంచి కీలక నేతలు పార్టీలో చేరతారనే ప్రచారం కూడా ఉండి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జాబితా రెండు అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కు అన్నట్టుగా సాగుతోందని సమాచారం. 

బీజేపీ కొత్త స్ట్రాటజీ 

119 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరించింది. ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కీలక నేతలు పలువురు దరఖాస్తు చేసుకోకపోవం గమనార్హం. దరఖాస్తులు స్వీకరించిన బీజేపీ అభ్యర్థుల ప్రకటన చేయలేదు. తమ వ్యూహం తమకు ఉందని, నామినేషన్ల చివరి రోజు దాకా తాము ఎప్పుడైనా అభ్యర్థులను ప్రకటిస్తామని ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్లు కాకుండా వేరే ఎవరైనా బరిలోకి దిగుతారా..? కీలక నేతలెవరైనా బీజేపీతో టచ్ లోకి వచ్చారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

ALSO READ : కామ్రేడ్లకు నాలుగు సీట్లు మాత్రమే : కాంగ్రెస్ నిర్ణయం ఇదేనా

కామ్రేడ్ల దారెటు..

మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో చెట్టపట్టాలేసుకుతిరిగిన కామ్రేడ్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఐదేసి స్థానాలు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నట్టు సమాచారం. కనీసం రెండేసి స్థానాలు ఇచ్చినా ఓకే అన్న ధోరణి సీపీఐ, సీపీఎంలలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు పార్టీలు కోరుతున్న సీట్లు వీఐపీలవి కావడం గమనార్హం. ఈ తరుణంలో కీలక స్థానాలను కామ్రేడ్ల కోసం కాంగ్రెస్ వదులుకుంటుందా..? లేదా ఒంటరిగానే బరిలోకి దిగుతుందా..? అన్నది చర్చనీయాంశమైంది.