ఇంగ్లాండ్‌తో ఫైనల్‌ టెస్ట్‌లో ఆడేదెవరు?

ఇంగ్లాండ్‌తో ఫైనల్‌ టెస్ట్‌లో ఆడేదెవరు?
  • ఫైనల్‌ ఎలెవన్‌ఎలా!
  • టీమిండియాలో పలు మార్పులు
  • బుమ్రా ప్లేస్‌‌లో ఉమేశ్‌‌ ఖాయం!
  • గిల్‌‌, రహానె, సుందర్‌‌పై వేటు?
  • రేపటి నుంచి ఇంగ్లండ్‌‌తో ఫోర్త్‌‌ టెస్ట్‌‌

వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ బెర్త్‌‌ ఊరిస్తోన్న వేళ టీమిండియా.. ఇంగ్లండ్‌‌తో తుది సమరానికి సిద్ధమవుతోంది. స్పిన్‌‌ ట్రాక్‌‌తో ప్రత్యర్థికి కలలో కూడా ఊహించని షాకిచ్చిన కోహ్లీ సేన అదే మొతెరాలో మరోసారి బరిలోకి దిగనుంది. పర్సనల్‌‌ రీజన్స్‌‌తో సీనియర్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా ఈ మ్యాచ్‌‌కు దూరమవ్వగా.. ఇండియా ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో పలు మార్పులు చేయడం తప్పనిసరైంది.  పిచ్‌‌పై ఇంకా రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఫోర్త్‌‌ టెస్ట్‌‌కు ఎలాంటి వికెట్‌‌ను రెడీ చేస్తున్నారు? బుమ్రా ప్లేస్‌‌ను భర్తీ చేసేదేవరు ? కోహ్లీసేన ప్లాన్‌‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

అహ్మదాబాద్‌‌‌‌: రెండ్రోజుల్లోనే ముగిసిన థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో పది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌‌‌ను చిత్తు చేసిన టీమిండియా మరో పోరాటానికి రెడీ అవుతోంది. నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరి టెస్ట్‌‌‌‌ ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం  ప్రారంభం కానుంది. పింక్‌‌‌‌ బాల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో గెలిచిన కోహ్లీ సేన సిరీస్‌‌‌‌లో 2–1తో లీడ్‌‌‌‌లో ఉంది. మరోపక్క వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించాలంటే ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌ను కనీసం డ్రా గా ముగించాలి.  కోహ్లీ సేన ఈ సిరీస్‌‌‌‌ను 2–1 లేదా 3–1తో గెలిస్తే లార్డ్స్‌‌‌‌ వేదికగా జరగబోయే మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌‌‌‌తో తలపడుతుంది. అలా కాకుండా ఇంగ్లండ్‌‌‌‌ 2–2తో సిరీస్‌‌‌‌ను సమం చేస్తే మాత్రం  టీమిండియా కల చెదురుతుంది. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌ చేరుతుంది. అందువల్ల ఈ టెస్టును టీమిండియా లైట్‌‌‌‌ తీసుకోవడానికి లేదు. జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా జట్టుకు దూరమైన వేళ టీమిండియా పక్కా ప్లాన్‌‌‌‌తో బరిలోకి దిగాల్సిందే. బుమ్రాకు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌తోపాటు ఓపెనింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌, మూడో స్పిన్నర్‌‌‌‌ స్థానాలు ఫోర్త్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు ముందు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముందున్న సవాళ్లు. ఇది కాక, బ్యాటింగ్‌‌‌‌లో వరుసగా ఫెయిలవుతున్న  వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానె స్థానంపై ఓ నిర్ణయం తీసుకునే చాన్స్‌‌‌‌ కనిపిస్తోంది. కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి ఎలాంటి కాంబినేషన్‌‌‌‌తో ముందుకెళ్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

సుందర్‌‌‌‌ బదులు కుల్దీప్‌‌‌‌..

స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌పై ఈ మ్యాచ్‌‌‌‌లో వేటు పడే చాన్సుంది. బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా రాణిస్తున్న సుందర్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌‌‌‌లో 76.4 ఓవర్లు వేసిన సుందర్‌‌‌‌ 53.8 యావరేజ్‌‌‌‌తో ఐదు వికెట్లే తీశాడు. వికెట్ల సంగతి ఎలా ఉన్నా రన్స్‌‌‌‌ కూడా కట్టడి చేయలేకపోవడంతో థర్డ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రోల్‌‌‌‌కు న్యాయం జరగడం లేదు. అశ్విన్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా,  ఇండియా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్ని కొనసాగిస్తే కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లోకి రావొచ్చు.

రహానెపై వేటు వేస్తారా ?

నాలుగో  టెస్ట్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవెన్‌‌‌‌ విషయంలో వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానెపై  కెప్టెన్‌‌‌‌ కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్‌‌‌‌లో వరుసగా ఫెయిలవుతున్న రహానెకు కోహ్లీ చాలా సపోర్ట్‌‌‌‌ చేస్తున్నాడు. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌పై సెంచరీ, చెన్నైలో జరిగిన సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ తప్పితే గత 17 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో రహానె మెప్పించింది లేదు.  అజింక్యా ఫెయిలవ్వడం వల్ల టాపార్డర్‌‌‌‌తోపాటు మిడిలార్డర్‌‌‌‌పై ప్రెజర్‌‌‌‌ పెరుగుతోంది. అందువల్ల జింక్స్‌‌‌‌ బదులుగా కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ను ఆడిస్తే మంచిదన్న అభిప్రాయాలున్నాయి. ఐదో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌కు వచ్చే రాహుల్‌‌‌‌కు.. ఇటు టాపార్డర్‌‌‌‌ను అటు లోయరార్డర్‌‌‌‌ను సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్‌‌‌‌ నిర్మించే కెపాసిటీ ఉంది.  పైగా, ఆసీస్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నుంచి రాహుల్‌‌‌‌ బెంచ్‌‌‌‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అతనికి అవకాశమిచ్చేందుకు వైస్​ కెప్టెన్‌‌‌‌పై వేటు వేసే సాహసం కోహ్లీ, శాస్త్రి చేస్తారా? అన్నది చూడాలి.

పిచ్‌‌‌‌పై సస్పెన్స్‌‌‌‌

స్పిన్‌‌‌‌ వికెట్లతో వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఇంగ్లండ్‌‌‌‌ను చిత్తు చేసిన టీమిండియా ఆఖరి టెస్టు కోసం ఎలాంటి పిచ్‌‌‌‌ను ఎంచుకుంటుందనేదానిపై ఆసక్తి నెలకొంది.  బ్యాటింగ్‌‌‌‌ ఫ్రెండ్లీ వికెట్‌‌‌‌ రెడీ చేస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు లీక్స్‌‌‌‌ ఇచ్చాయి.  ప్రస్తుతానికైతే లాస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు వాడే పిచ్‌‌‌‌ గ్రాస్‌‌‌‌తో నిండి ఉంది. మ్యాచ్‌‌‌‌ మొదలయ్యే లోపు గ్రాస్‌‌‌‌ను ఎంత మేర తొలగిస్తారో చూడాలి. రోహిత్‌‌‌‌, రహానె తదితరులు మాత్రం ఇండియా అంటేనే స్పిన్‌‌‌‌ వికెట్ల అని ఇప్పటికీ అంటున్నారు. ఈ లెక్కన ఆఖరాటకూ ఇండియా స్పిన్‌‌‌‌ వికెట్‌‌‌‌నే ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో గురువారం వరకూ ఈ సస్పెన్స్‌‌‌‌ కొనసాగనుంది

మయాంక్‌‌‌‌కు చాన్సుందా..

టీమిండియా బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌లో పెద్దగా సమస్యల్లేవు. అయితే, ఓపెనింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌పై కాస్త చర్చ జరుగుతోంది. రోహిత్‌‌‌‌ శర్మ, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌లో ఇప్పటిదాకా ఇన్నింగ్స్‌‌‌‌ ప్రారంభించారు. రోహిత్‌‌‌‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. గిల్‌‌‌‌ మాత్రం తడబడుతున్నాడు. చెన్నైలో జరిగిన సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌తోపాటు మొతెరాలో జరిగిన మూడో టెస్ట్‌‌‌‌లోనూ నిరాశపరిచాడు. అందువల్ల మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ టాపార్డర్‌‌‌‌లో మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ను పరీక్షించే చాన్సు ఉంది. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో ఫెయిలవ్వడంతో మయాంక్‌‌‌‌ బెంచ్​కు పరిమితమయ్యాడు. కానీ సొంతగడ్డపై  మయాంక్‌‌‌‌కు మంచి రికార్డు ఉంది. అతను టెస్టుల్లో ఇప్పటిదాకా సాధించిన మూడు సెంచరీలు ఇండియాలో చేసినవే. ఈ నేపథ్యంలో గిల్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను మయాంక్‌‌‌‌తో భర్తీ చేసే చాన్స్‌‌‌‌ కనిపిస్తోంది. 

ఫీల్డింగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌

ఇంగ్లండ్‌‌‌‌తో ఫోర్త్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు సమయం దగ్గర పడుతున్న వేళ టీమిండియా ఫీల్డింగ్‌‌‌‌ను ఇంప్రూవ్​ చేసుకోవడంపై దృష్టి పెట్టింది. మంగళవారం పూర్తిస్థాయి సెషన్‌‌‌‌లో పాల్గొన్న ఇండియా క్రికెటర్లు ఫీల్డింగ్​ ప్రాక్టీస్​ చేశారు.  మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌ సుందర్, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, పేసర్‌‌‌‌ ఉమేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ క్యాచ్​లు అందుకుంటున్న  ఫొటోలను బీసీసీఐ సోషల్‌‌‌‌ మీడియాలో పెట్టింది.  మయాంక్‌‌‌‌ పలు డైవింగ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌లు అందుకున్నాడు. క్యాచ్‌‌‌‌లతోపాటు వేర్వేరు పొజిషన్స్‌‌‌‌ నుంచి బాల్‌‌‌‌ను వికెట్లకు త్రో చెయ్యడాన్ని కూడా క్రికెటర్లు ప్రాక్టీస్‌‌‌‌ చేశారు. సోమవారం జరిగిన హై ఇంటెన్సిటీ ట్రెయినింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో టీమిండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానె నెట్స్‌‌‌‌లో చెమటోడ్చారు.రోహిత్​ కూడా కాసేపు బ్యాటింగ్​ ప్రాక్టీస్​ చేశాడు.

బుమ్రా ప్లేస్‌లో ఉమేశ్‌. . 

‌‌వ్యక్తిగత కారణాలతో స్పీడ్‌‌స్టర్‌‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా ఫోర్త్‌‌ టెస్ట్‌‌కు దూరమయ్యాడు. దీంతో పేసర్ల కోటాలో ఓ ప్లేస్‌ ఖాళీ అవ్వగా.. సీనియర్‌‌ బౌలర్‌‌ ఉమేశ్‌ యాదవ్‌ రేసులోకి వచ్చాడు. ఫోర్త్‌‌ టెస్ట్‌‌కు బ్యాటింగ్‌ ఫ్రెండ్లీ వికెట్‌ రెడీ చేస్తే సిసలైన పేసర్ ఉమేశ్‌ ఫైనల్‌ ఎలెవన్‌‌లో ఉండటం ఖాయం. పిచ్‌ నుంచి
ఎక్స్‌‌ట్రా పేస్‌ రాబట్టగల ఉమేశ్‌ ఇంగ్లిష్‌ ప్లేయర్లను కట్టడి చేస్తాడనే అంచనాలున్నాయి. ఈ కారణం వల్లే మహ్మద్‌ సిరాజ్‌ నుంచి పోటీ ఉన్నప్పటికీ ఉమేశ్‌‌కే మేనేజ్‌ మెంట్‌ ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా, 2018 తర్వాత పెర్ఫామెన్స్‌‌ పరంగా ఉమేశ్‌ చాలా మెరుగయ్యాడు. వరల్డ్‌‌ బెస్ట్‌‌ పేసర్లలో ఒకడిగా నిలిచాడు. పైగా, సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న ఉమేశ్‌ .. పాత బాల్‌‌తో రివర్స్‌‌ స్వింగ్‌ కూడా రాబట్టగలడు. అలాగని సిరాజ్‌ను తక్కువ చేయడానికి లేదు. మెరుగైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌‌తో నిలకడగా బౌలింగ్‌ చేసే హైదరాబాదీ పెర్ఫామెన్స్‌‌ పరంగా ఇటీవల మరింత రాటుదేలాడు. ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలోకి దిగితే ఇషాంత్‌, సిరాజ్, ఉమేశ్‌ తుది జట్టులో ఉంటారు. అదే ఇద్దరితో బరిలోకి దిగితే కోహ్లీ సీనియర్లకే ఓటేస్తాడా..సిరాజ్‌‌కు చాన్స్‌‌ ఇస్తాడా చూడాల్సి ఉంది.