Health Alert: ఎబోలా వైరస్ మళ్లీ కలవరపెడుతోంది... ఎలా గుర్తించాలి... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.!

Health Alert: ఎబోలా వైరస్  మళ్లీ కలవరపెడుతోంది...  ఎలా గుర్తించాలి... తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.!

ప్రపంచం కరోనా భయాల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో ప్రమాదకర వైరస్ వార్తలు కలవరపెడుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తుండటం ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

 పరిస్థితి తీవ్రత పెరగడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు చాలా అరుదుగా వస్తాయి. ఒక వ్యాధి దేశాల సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు చేరే అవకాశం కనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి హెచ్చరిక ఇస్తారు. 

ప్రస్తుతం ఎబోలా వ్యాప్తి కాంగో, ఉగాండా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా మొదలైన వైరస్ కేసులు ఇప్పుడు వందల సంఖ్యకు చేరింది. మరణాలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వైద్య సిబ్బందికీ వైరస్ సోకడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. తాజాగా దక్షిణ కివూ ప్రాంతంలో కొత్త కేసు బయటపడటం మరింత టెన్షన్​ను పెంచింది. వైరస్ మొదట గుర్తించిన ప్రాంతం దాటి కొత్త ప్రాంతాలకు చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఈసారి ఎందుకంత భయం?

ఎబోలా కొత్త వ్యాధి కాదు. గతంలో కూడా పలు సార్లు ఆఫ్రికాలో విజృంభించింది. కానీ ఈసారి బయటపడిన వైరస్ “బుండిబుగ్యో” అనే అరుదైన స్ట్రెయిన్. ఇదే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య నిపుణుల్లో ఎక్కువ టెన్షన్ పెంచుతోంది. కారణం ఏమిటంటే ఈ స్ట్రెయిన్‌‌ను అడ్డుకోవడానికి పూర్తి స్థాయి ఆమోదం పొందిన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో లేదు. కొన్ని ప్రయోగ దశ వ్యాక్సిన్లు ఉన్నా, పెద్ద స్థాయిలో వాడే పరిస్థితి ఇంకా రాలేదు. అందుకే కంట్రోల్​ చేయడం కాస్త కష్టమవుతోందని డబ్ల్యూహెచ్​ఓ చెప్తోంది.

మరో సమస్య ఏంటంటే వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలు ఇప్పటికే యుద్ధాలు, పేదరికం, వైద్య సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సరైన ఆస్పత్రులు లేవు. పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్నాయి. చాలా కేసులు మొదట గుర్తించలేకపోయారు. అందుకే వైరస్ రెండు నెలలపాటు గుర్తించకుండా వ్యాపించి ఉండొచ్చని ఎక్స్​పర్ట్స్‌‌ అనుమానిస్తున్నారు. 

అసలు ఎలా వ్యాపిస్తుంది?

చాలామంది ఎబోలా పేరు వినగానే కరోనా తరహా వైరస్ అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా భిన్నం. కరోనా గాలిద్వారా వేగంగా వ్యాపించింది. ఎబోలా మాత్రం అలాంటిది కాదు. ప్రధానంగా వైరస్ సోకిన వ్యక్తి రక్తం, చెమట, ఉమ్మి, వాంతులు, విరేచనాలు, శరీర ద్రవాలు తగిలితేనే వ్యాపిస్తుంది. 

రోగి వాడిన వస్తువులు తాకినా ప్రమాదమే. అంత్యక్రియల సమయంలో శరీరాన్ని తాకడం వల్ల కూడా వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వైద్య సిబ్బందికి ప్రమాదం ఎక్కువ. సరైన రక్షణ లేకుండా రోగులను చూసినా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ఆస్పత్రుల్లో ఇదే జరుగుతోందని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది. 

ఎబోలా లక్షణాలు 

మొదట సాధారణ జ్వరంలా మొదలవుతుంది. అందుకే మొదటి దశలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. తీవ్ర జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పితో బాధపడతారు. తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మొదలవుతాయి. పరిస్థితి విషమిస్తే శరీరంలో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తం రావచ్చు. చికిత్స ఆలస్యమైతే ప్రాణానికే ముప్పు. 

కొన్ని సందర్భాల్లో వైరస్ వేగంగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. రోగి ఒక్కసారిగా బలహీనపడిపోతాడు. శరీర రక్షణ వ్యవస్థ పూర్తిగా కుంగిపోతుంది. అందుకే ఎబోలా మరణాల శాతం ఇతర వైరస్‌‌ల కంటే ఎక్కువగా ఉంటుంది.ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో ఆరోగ్య అవగాహన తక్కువగా ఉండటం, సంప్రదాయ అంత్యక్రియలు, పెద్ద ఎత్తున కుటుంబ సమావేశాలు, వైద్య సదుపాయాల కొరత వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు వైద్య బృందాలపై అనుమానం పెంచుకోవడం కూడా సమస్యగా మారింది. 

అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి ఎందుకు?

సాధారణంగా డబ్ల్యూహెచ్​ఓ ఇలాంటి ప్రకటన చేసిందంటే.. దీని వెనక ఏదో పెద్ద విషయమే ఉంటుంది. ఒక వైరస్ ప్రపంచ ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం అవుతుందనే భావన వచ్చినప్పుడు మాత్రమే “ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్​సర్న్” ప్రకటిస్తుంది. అంటే ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని అర్థం. 

ఇప్పటి ఎబోలా వ్యాప్తిలో పెద్ద సమస్య ఏమిటంటే కేసులు పలు ప్రాంతాల్లో కనిపించడం. కాంగో నుంచి ఉగాండాకు వైరస్ చేరింది. రాజధాని ప్రాంతాల దాకా కేసులు నమోదయ్యాయి. జనసంచారం ఎక్కువగా ఉండే నగరాల్లో వైరస్ కనిపించడం ప్రమాదకరంగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక స్థాయిలో ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద మహమ్మారి స్థాయికి ఇంకా చేరలేదని చెప్తోంది. అయినా పరిస్థితి వేగంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. 

 భారత్‌‌కు ప్రమాదముందా?

ఇప్పుడిదే ఎక్కువమంది అడుగుతున్న ప్రశ్న. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ప్రస్తుతం భారత్‌‌లో ఒక్క ఎబోలా కేసు కూడా లేదని స్పష్టం చేసింది. 2014 తర్వాత కొత్త కేసు నమోదు కాలేదని తెలిపింది. అయినా ముందస్తు జాగ్రత్తలు పెంచింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పెంచారు. 

హైదరాబాద్‌‌లోని రాజీవ్​ గాంధీ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో కూడా థర్మల్‌‌ స్క్రీనింగ్‌‌ మొదలుపెట్టారు. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేస్తున్నారు. పుణెలోని వైరాలజీ ల్యాబ్‌‌ను ప్రధాన పరీక్షా కేంద్రంగా సిద్ధం చేశారు. 

రాష్ట్రాలకు కూడా అప్రమత్తత సూచనలు పంపించారు. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని సూచించింది. వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పింది. 

 ఎబోలాకు చికిత్స ఉందా?

ఎబోలా కోసం ప్రత్యేక మందు పూర్తిగా అందుబాటులో లేదు. కానీ సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం పెరుగుతుంది. శరీరంలో నీరు తగ్గకుండా చూడటం, రక్తపోటు కంట్రోల్ చేయడం, ఇన్ఫెక్షన్లు నియంత్రించడం చాలా ముఖ్యం. కొంతమంది రోగులు సరైన చికిత్సతో కోలుకుంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీపై వేగంగా పనిచేస్తున్నారు. కానీ బుండిబుగ్యో స్ట్రెయిన్‌‌పై పూర్తి ఫలితాలు రావడానికి ఇంకా సమయం పడుతుందని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు.
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం భారత్‌‌లో భయపడాల్సిన పరిస్థితి లేదు. కానీ అవగాహన అవసరం. ట్రావెల్ హిస్టరీ దాచకూడదు. ఆఫ్రికా ప్రభావిత ప్రాంతాలకు అవసరం లేకపోతే వెళ్లకపోవడం మంచిది. వెళ్లాల్సి వస్తే రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. అనారోగ్యంతో ఉన్నవారిని తాకేటప్పుడు జాగ్రత్త అవసరం. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. శరీర ద్రవాలు తగలకుండా చూడాలి. 

వైద్య సిబ్బంది పూర్తి రక్షణ పరికరాలు వాడాలి. ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కచ్చితంగా అమలు చేయాలి. అనుమానిత రోగులను వెంటనే ఐసోలేషన్‌‌లో ఉంచాలి. కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి. 

ఎబోలా వార్తలు బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనేక వదంతులు తిరుగుతున్నాయి. “ఇది కరోనా కంటే ప్రమాదకరం”, “ప్రపంచం మళ్లీ లాక్‌‌డౌన్‌‌లోకి వెళ్తుంది” లాంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు.

ముందున్న సవాలు ఏమిటి?

గత అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోంది. కరోనా తర్వాత ప్రపంచ దేశాలు వైరస్ కంట్రోల్​లో వేగంగా స్పందిస్తున్నాయి. స్క్రీనింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి వ్యవస్థలు ముందుకంటే మెరుగయ్యాయి. ఇప్పటి పరిస్థితి చూస్తే అప్రమత్తత అవసరం ఉంది. కానీ భయాందోళనలు అవసరం లేదని హెల్త్ ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. 

ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు

అమెరికా ఇప్పటికే స్క్రీనింగ్ ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై పరిమితులు పెట్టింది. ఉగాండా కొన్ని విమాన సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించింది. పలు దేశాలు సరిహద్దు తనిఖీలు పెంచాయి. భారత్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఆఫ్రికా దేశాలతో జరగాల్సిన ఇండియా– ఆఫ్రికా సమ్మిట్‌‌ను వాయిదా వేసింది. ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

 ఎబోలా ఎలా మొదలవుతుంది?

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ వైరస్ మొదట అడవి జంతువుల నుంచి మనుషులకు వచ్చింది. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌‌.. ప్రధాన వాహకులుగా భావిస్తున్నారు.  ఫ్రూట్ బ్యాట్స్‌‌ అనేవి పండ్లు, పుప్పొడి, మకరందం ఆహారంగా తీసుకునే పెద్ద రకం గబ్బిలాలు. వీటి ముఖాలు నక్కలను పోలి ఉండటం వల్ల వీటిని ‘ఫ్లయింగ్ ఫాక్సెస్’ (ఎగిరే నక్కలు) అని కూడా పిలుస్తారు. 

ఇవి పర్యావరణంలో విత్తనాలను వ్యాప్తి చేయడంలో (సీడ్ డిస్పర్సల్) కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో అడవి మాంసం తినే అలవాటు ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైరస్ మనుషులకు చేరే అవకాశం ఉంటుంది. తర్వాత మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది.