Mayank Yadav: గంటకు 156 కి.మీ వేగం.. ఎవరీ మయాంక్ యాదవ్? 

Mayank Yadav: గంటకు 156 కి.మీ వేగం.. ఎవరీ మయాంక్ యాదవ్? 

నైపుణ్యం ఉన్న యువ క్రికెటర్లను వెలుగులోకి తేవడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ అద్భుత అవకాశమని మరోసారి నిరూపితమైంది. శనివారం(మార్చి 30) లక్నో సూపర్ జెయింట్స్ , పంజాబ్ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా 21 ఏళ్ల యువ కెరటం తెరమీదకు వచ్చాడు. అతనే.. మాయంక్ యాదవ్. నిలకడగా గంటకు145 కి.మీకుపైగా వేగంతో బంతులేయడం అతని స్పెషాలిటీ. ఈ యువ పేసర్.. పంజాబ్ కింగ్స్‌ పై ఏకంగా 156 కి.మీ వేగంతో బంతి సంధించి ఔరా అనిపించాడు. దీంతో ఎవరీ మయాంక్ యాదవ్..? అని నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. 

సీనియర్లే బెంబేలు

లక్నో నిర్ధేశించిన 200 పరుగుల ఛేదనలో పంజాబ్ ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో , శిఖర్ ధావన్‌ల జోడి తొలి 10 ఓవర్లలో 98 పరుగులు జోడించారు. ఇంకా విజయానికి కావాల్సింది.. 60 బంతుల్లో 102 పరుగులు. వీరిద్దరి జోరు చూస్తే ఇంకెముందిలే అనుకున్నారు. అప్పుడే అసలు కథ మొదలైంది. మయాంక్‌ తన వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.  తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్నానన్న భయం అతనిలో కాసింతైనా లేదు. నిలకడగా 145 కి.మీకుపైగా వేగంతో బంతులేస్తూ సీనియర్లనే బెంబేలెత్తించాడు. 155.8 వేగంతో బంతిని విసిరి ప్రస్తుత సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.

 ఎవరీ మాయంక్ యాదవ్..? 

మాయంక్ యాదవ్ అసలు పేరు.. మయాంక్ ప్రభు యాదవ్. జూన్ 17, 2002న ఢిల్లీలో జన్మించాడు. 2021లో ఢిల్లీ తరుపున అరంగ్రేటం చేసిన ఈ యువ పేసర్.. దేశవాళీ క్రికెట్ లో 17 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీశాడు. అలాగే, 10 టీ20 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. 

ALSO READ ; ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ ఆఖర్లో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఎంపిక!

రెండేళ్ల కిందటే మయాంక్‌ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 మెగా వేలంలో లక్నో అతన్ని రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో అతనికి ఒక్క అవకాశమూ రాలేదు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముంది గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలా అని లక్నో అతన్ని వదులుకోలేదు.  అతనిపై నమ్మకం ఉంది అవకాశం ఉంది. దాన్ని మయాంక్ ఒడిసి పట్టుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటి తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మున్ముందు అతని నుంచి అత్యంత వేగవంతమైన బంతి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే జాతీయ జట్టులోకి అడుగు పెట్టడం ఖాయమన్నది క్రికెట్‌ విశ్లేషకుల మాట.