వెలుగు ఓపెన్ పేజీ.. బీజేపీకి బెంగాల్, కేరళ ఎందుకంత ప్రత్యేకం!

వెలుగు ఓపెన్ పేజీ.. బీజేపీకి బెంగాల్, కేరళ  ఎందుకంత ప్రత్యేకం!

ప్రస్తుతం  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధానంగా బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం ఉన్నాయి.  ఇవి సాధారణ ఎన్నికలు కావు.  జాతీయ రాజకీయ దిశను మార్చే ఎన్నికలుగా చెప్పవచ్చు. బీజేపీకి ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం.  ముఖ్యంగా బెంగాల్,  కేరళ రాష్ట్రాలపై అధిక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక వ్యూహాత్మక, భావజాల, ప్రాంతీయ,  భవిష్యత్ ఎన్నికలకు సంబంధించిన లోతైన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.  భారత రాజకీయాల్లో ముఖ్యంగా  రెండు కోణాలుంటాయి. 

 ఒకటి పైకి  కనిపించే  ఎన్నికలు,  ఇంకొకటి అంతర్గతంగా నడిచే సామాజిక శక్తుల నియంత్రణ.  బీజేపీ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కానీ అది సరిపోదు. ఎందుకంటే యావత్ భారతదేశం కాషాయమయం చేయాలనే సంకల్పం వాళ్ళది.  అందులో భాగంగానే ఈ రెండు ప్రధాన కేంద్రాలైనా  బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఒక విధంగా రాజకీయంగా బలంగా ప్రతిఘటించే యుద్ధ మైదానాలుగా చెప్పవచ్చు. ఇక్కడ గెలవడం అంటే శత్రు సామ్రాజ్యాన్ని కూల్చడం.  

ఒకసారి  బెంగాల్‌‌‌‌ రాష్ట్రాన్ని లోతుగా పరిశీలిస్తే,, అది సాధారణ రాష్ట్రం కాదు. అక్కడ ఓటర్ తన ఉనికి గుర్తింపు గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు.  ఈ అంశాన్నే మమతా బెనర్జీ  రాజకీయంగా  బలంగా  ఉపయోగించిన ఆయుధం. అంటే అక్కడ పోటీ అభివృద్ధి మీద కాదు. ఎవరికి ఆ నేలపై హక్కు ఉంది?  అనే భావోద్వేగ ప్రశ్న మీద బీజేపీ ఇక్కడ గెలవాలి అంటే  కేవలం ప్రచారం చేయడంతో  మాత్రమే సరిపోదు.  ఆ  భావోద్వేగాన్ని తిరగరాయాలి.   కేరళ పరిస్థితి ఇంకాస్త భిన్నంగా ఉంటుంది. 

అక్కడ ప్రజలు ఓటు వేయడం ఒక ఐడియాలజీ (భావజాలం) ఆధారంగా కమ్యూనిస్టులకు,  కాంగ్రెస్  కూటమి  మధ్య పోటీ సంవత్సరాలుగా నడుస్తోంది. ఈ రెండు కూటములు సమాజాన్ని పూర్తిగా విభజించి తమ తమ స్థావరాలు ఏర్పరచుకున్నాయి. బీజేపీకి ఇక్కడ సమస్య ఏమిటంటే  కొత్త  ఓటర్లను  సంపాదించడం కాదు. ఇప్పటికే ఉన్న స్థిరమైన  నమ్మకాలను విడగొట్టడం.  ఇది రాజకీయంగా  అత్యంత కఠినమైన పని.  కాబట్టి  ఈ రాష్ట్రాన్ని వారు తక్షణ గెలుపుగా  కాకుండా దీర్ఘకాల మార్పు ప్రాజెక్ట్​గా చూస్తున్నారు.   బీజేపీ ఈ రెండు రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి కారణం అదే. ఇవి రెండు రాష్ట్రాలు  కలిపి ఒక పెద్ద సందేశం ఇస్తాయి.  

భావజాల రాజకీయాలు

బెంగాల్​లో  గెలిస్తే  ప్రాంతీయ శక్తులు కూడా కూలవచ్చు. కేరళలో బలం పెరిగితే భావజాల రాజకీయాలు  కూడా  మారవచ్చు. అంటే రెండు వేర్వేరు రకాల  ప్రతిఘటనలను  ఒకేసారి ఎదుర్కొని  గెలవాలని ప్రయత్నం. ఈ ఎన్నికలు అధికారం కోసం కాదు ఇది ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే ప్రయత్నం. ఒకసారి ఓటరు ఇలా అనుకోవడం మొదలుపెడితే ఇవాళ గెలవకపోయినా రేపు గెలుస్తారు. అదే అసలు మలుపు. బీజేపీ ఇప్పుడు అదే దశను టార్గెట్ చేస్తోంది. గెలవకపోయినా, ఆ భావనను నాటగలిగితే, అది వచ్చే ఎన్నికల్లో ఆటోమేటిక్‌‌‌‌గా ఓట్లుగా మార్చుకోవచ్చు. 

గెలవడం కష్టమైన రాష్ట్రాల్లోనే ఎక్కువ శక్తి పెట్టడం అంటే, పార్టీ తనకు తానే ఒక పరీక్ష పెట్టుకుంటోంది. ఎందుకంటే సులభంగా గెలిచే ప్రదేశాల్లో విజయం పెద్దగా విలువ ఇవ్వదు. కానీ  కష్టమైన ప్రదేశంలో చిన్న పురోగతి కూడా భవిష్యత్‌‌‌‌లో భారీ ఫలితాలు ఇస్తుంది. బెంగాల్‌‌‌‌లో 30% ఓటు నుంచి 40%కి వెళ్లడం, కేరళలో 10% నుంచి 20%కి వెళ్లడం. ఇవి బయటకు చిన్న మార్పుల్లా కనిపించినా, రాజకీయంగా ఇవే భూకంపాలు.

రాజకీయ సంస్కృతి మార్పు

బీజేపీ ఈ రెండు రాష్ట్రాలపై ఇప్పుడు ఇంతగా దృష్టి పెట్టడం యాదృచ్ఛికం కాదు. దేశవ్యాప్తంగా ఒక స్థాయికి  చేరుకున్న తర్వాత, ఏ పార్టీ అయినా విస్తరణ చేయాలనుకుంటుంది. ఆ దశలో ప్రధాన లక్ష్యం కొత్త ప్రాంతాల్లో స్థిరపడటం. బెంగాల్, కేరళ ఈ దశలో సహజంగా లక్ష్యాలుగా మారాయి. ఎందుకంటే ఇవి ఇప్పటికీ పూర్తిగా తమ ప్రభావంలోకి రాని పెద్ద రాష్ట్రాలు. ఇక్కడ ముఖ్యమైన అంశం ప్రాంతీయ నాయకత్వాన్ని బలహీనపరచడం. బెంగాల్‌‌‌‌లో  మమతా బెనర్జీ వంటి బలమైన నాయకత్వం ఉంది. 

ఇలాంటి నాయకులు కేవలం ఒక రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలరు.  ఇక్కడ  గెలవడం లేదా కనీసం ఆ నాయకత్వాన్ని బలహీనపరచడం ద్వారా భవిష్యత్‌‌‌‌లో జాతీయ స్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే తగ్గించే వ్యూహంలో  భాగంగా చెప్పవచ్చు. అలాగే మరొక లోతైన అంశం రాజకీయ సంస్కృతి మార్పు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటింగ్ విధానం చాలా  ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ  ప్రజలు తరచుగా భావజాలం, స్థానిక గౌరవం, లేదా సామాజిక సమీకరణాల ఆధారంగా ఓటు వేస్తారు. 

ఈ విధమైన రాజకీయ సంస్కృతిని మార్చడం అంటే కేవలం ఎన్నికల ప్రచారం కాదు. అది మీడియా, సంఘాలు, స్థానిక నాయకత్వం, దీర్ఘకాలిక ప్రాతిపదికపై పనిచేయాల్సిన పని. బీజేపీ ఈ ప్రక్రియను నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు తీసుకెళ్తోంది. గెలవాలంటే ఓటర్లు మాత్రమే సరిపోరు. గ్రామస్థాయి నుంచి బూత్​స్థాయి వరకు బలమైన నిర్మాణం అవసరం. ఈ ఎన్నికలు 
ఆ నిర్మాణానికి పరీక్షలాంటివి.  గెలవకపోయినా, ఆ నిర్మాణం బలపడితే అది భవిష్యత్‌‌‌‌లో పెద్ద ఫలితాలు ఇస్తుంది.

దేశవ్యాప్తంగా ఒకే రాజకీయ ధోరణి

ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం ప్రతిపక్ష సమీకరణాలను చెదరగొట్టడం..ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పోటీ ఇప్పటికే స్థిరంగా ఉన్న రెండు శక్తుల మధ్య ఉంటుంది. బీజేపీ ప్రవేశం వల్ల ఆ సమీకరణంలో మార్పు వస్తుంది. ఓటు విభజన జరుగుతుంది, కొత్త రాజకీయ కోణం ఏర్పడుతుంది. ఇది ప్రత్యక్షంగా గెలుపు ఇవ్వకపోయినా, ప్రత్యర్థి శక్తులను బలహీనపరచే అవకాశం ఇస్తుంది. ఇదే అంశాన్ని ఇంకా కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే ఇది దేశవ్యాప్తంగా ఒకే రాజకీయ ధోరణిని విస్తరించాలనే ప్రయత్నం. 

ఒక ప్రాంతంలో ఒక విధమైన రాజకీయ శైలి, మరో ప్రాంతంలో మరోవిధమైన శైలి ఉండటం భారత రాజకీయాల్లో సాధారణం. కానీ ఒకే విధమైన పార్టీ అన్ని ప్రాంతాల్లో స్థిరపడితే, అది దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చేస్తుంది. బెంగాల్, కేరళ ఈ మార్పుకు చివరి అడ్డుకట్టలుగా కనిపిస్తున్నాయి. అలాగే కార్యకర్తల మానసిక స్థితి. ఒక పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం కలిగి ఉంటే, అది వారి పనితీరును పూర్తిగా మార్చేస్తుంది. బెంగాల్, కేరళలో బలపడటం ద్వారా ఆ నమ్మకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం కూడా కనిపిస్తుంది.

 ఇది బయటకు చిన్న విషయంలాగ అనిపించినా, రాజకీయాల్లో ఇది చాలా పెద్ద మార్పుకు దారి తీస్తుంది.  మొత్తంగా చూస్తే ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పోటీ ఒకే స్థాయిలో అర్థం చేసుకోలేం. ఇది ఒకేసారి సమయం, నాయకత్వం, భావజాలం, నిర్మాణం, భవిష్యత్ లక్ష్యాలన్నింటినీ కలిపిన బహుళస్థాయి వ్యూహం. అందుకే ఈ ఎన్నికలు ఫలితాలకంటే ఎక్కువగా, భారత రాజకీయ దిశను నిర్ణయించే ప్రక్రియగా మారాయి. అందుకే ఈ ఎన్నికలలో  బీజేపీకి ఈ  రెండు రాష్ట్రాలు చాలా ప్రత్యేకం. 

 అమ్జాద్​మియా, అడ్వకేట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.