
న్యూఢిల్లీ: ఏడు బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలు కోసం టెండర్లు పిలిచిన యాంటీ కరప్షన్ అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవినీతిపై పోరాడాల్సిన సంస్థ.. విలాసాలపై దృష్టిపెట్టిందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ‘‘లోక్‌పాల్ సభ్యులు సొంత ప్రయోజనాలపై దృష్టిపెట్టారు.
అసలు ఆ సంస్థ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులు ఏంటి? ఎంతమందిని అరెస్టు చేసింది? ఆర్ఎస్ఎస్ ఆనాడు అన్నా హజారే, అర్వింద్ కేజ్రీవాల్ ద్వారా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అవినీతి కట్టుకథలు అల్లింది. కానీ లోక్‌పాల్ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘‘ఇప్పుడు లోక్‌పాల్ చైర్మన్, సభ్యులకు అత్యాధునిక కార్లే ఇచ్చారు. మరి బీఎండబ్ల్యూ ఎందుకు? ప్రజాధనం వృథా చేయడం ఎందుకు?” అని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు.
బడ్జెట్‌లో 10%..
లోక్‌పాల్ సభ్యులు చట్టాన్ని కాపాడడం వదిలేసి, విలాసాల వెంటపడుతున్నారని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ విమర్శించారు. ‘‘ఇప్పటి వరకు 8,703 ఫిర్యాదులు వచ్చాయి. కానీ 24 కంప్లయింట్లపైనే దర్యాప్తు జరిపారు. ఆరుగురిపైనే విచారణకు అనుమతి లభించింది. ఆ కేసులన్నీ వదిలేసి బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దృష్టిపెట్టారు. ఇదీ మన లోక్‌పాల్” అని అంటూ కామెంట్ చేశారు. ‘‘లోక్‌పాల్ ఏడాది బడ్జెట్ రూ.44.32 కోట్లు. అందులో రూ.5 కోట్లతో 7 బీఎండబ్ల్యూ కార్లు కొంటున్నారు.
అంటే బడ్జెట్‌లో 10% కార్ల కోసమే ఖర్చు పెడుతున్నారు. అవినీతి నిరోధక సంస్థ అయిన లోక్‌పాల్‌లోనే అవినీతి జరిగితే దర్యాప్తు చేసేదెవరు?” అని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ప్రశ్నించారు. కాగా, లోక్‌పాల్ చైర్మన్, ఆరుగురు సభ్యుల కోసం రూ.5 కోట్లతో 7 బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేసేందుకు ఈ నెల 16న టెండర్లు ఆహ్వానించారు.