కేంద్ర పథకాలు ఎందుకు..అమలు చేస్తలేరు?

కేంద్ర పథకాలు ఎందుకు..అమలు చేస్తలేరు?

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తదితర ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు అమలు చేయడం లేదని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. బీజేపీలో కుటుంబ పాలన ఉండదని, ఈ తొమ్మిదేండ్లలో ఒక్క కేంద్ర మంత్రిపైనా అవినీతి ఆరోపణలు రాలేదని పేర్కొన్నారు. బీజేపీ నేతలకు దేశ సంక్షేమం తప్ప.. వ్యక్తిగత ఎజెండా ఉండదని ఆయన స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బర్కత్‌‌‌‌‌‌‌‌పురలో బీజేపీ సిటీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో రేషన్ షాపుల్లో తప్పుడు డేటాతో బియ్యం దోచుకునేవారు.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రేషన్‌‌‌‌‌‌‌‌ను డిజిటలైజేషన్ చేశాం. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు వారి నోర్లు మూత పడ్డాయి. ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. మోదీ ప్రభుత్వానికి పర్సనల్ ఎజెండా అంటూ ఏదీ లేదు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ సర్కార్ పనిచేస్తున్నది. మోదీ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ 5వ స్థానానికి చేరుకుంది. జీడీపీలో అమెరికా, చైనా, జర్మనీ, యూరప్‌‌‌‌‌‌‌‌ను తలదన్ని 7% వృద్ధితో దూసు కుపోతోంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లెషన్‌‌‌‌‌‌‌‌ 4 శాతానికి తగ్గింది. అదే వెనిజులా లాంటి దేశంలో 40 శాతం పైనే ఉంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా తయారైంది”అని జవదేకర్ అన్నారు. 

డిజిటల్‌‌‌‌‌‌‌‌ లావాదేవీల్లో మనమే ఫస్ట్‌‌‌‌‌‌‌‌..

దేశంలో డిజిటల్ విప్లవానికి మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జవదేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. జన్ ధన్ ఖాతాల ద్వారా నేరుగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకే అందుతున్నాయని పేర్కొన్నారు. 21 ప్రభుత్వ సేవలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. డీజీ లాకర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచంలోనే డిజిటల్ లావాదేవీలు మన దేశంలోనే అత్యధికంగా జరుగుతున్నాయని తెలిపారు. ‘‘20 వేల రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చాం. డిజిటల్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం.

దేశ ప్రజలకు ఉచితంగా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్, 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం ఇచ్చాం. ప్రపంచాన్ని భారత్ లీడ్ చేస్తోంది. ఇది పాత ఇండియా కాదు.. మారిన ఇండియా”అని చెప్పారు. ‘‘దేశంలో మోడీ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో దాదాపు రూ.30 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో చేరాయి. కాంగ్రెస్ హయాంలో రూ.100 పంపిస్తే లబ్ధిదారులకు రూ.15 మాత్రమే అందేవని రాజీవ్ గాంధీయే స్వయంగా చెప్పారు. కానీ నేడు ఆ దుస్థితి లేదు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ తొమ్మిదేండ్ల పాలనపై రాష్ట్ర పార్టీ ముద్రించిన ప్రత్యేక పుస్తకాన్ని జవదేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించారు.