
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన ఆ పార్టీ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. సీఎం పదవి కోసం సిద్ధరామయ్యతో తీవ్రంగా పోటీపడి చివరకు త్యాగం చేశారు. దీంతో పార్టీపై తనకున్న విధేయతను డీకే మరోసారి చాటుకున్నారు. డికే త్యాగాన్ని గుర్తించిన కాంగ్రెస్..ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు..మరో కీలకమైన శాఖలను కట్టబెట్టింది. అయితే సీఎం పదవిని డీకే..ఊరికే త్యాగం చేయలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ముందు డీకే శివకుమార్ కొన్ని కీలక డిమాండ్‌లు ఉంచినట్లు తెలుస్తోంది. మరి ఆ డిమాండ్లు ఏంటనేవి ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
పార్టీకి విధేయత కారణంగానే డీకే శివకుమార్ సీఎం పదవిపై పట్టు సడలించినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆయన్ను ఒప్పించేందుకు స్వయంగా సోనియాగాంధీ రంగంలోకి దిగారట. సోనియా గాంధీకి శివకుమార్ నమ్మిన బంటు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానం సిద్ధరామయ్య వైపు మొగ్గుచూపడంతో డీకే కాస్త బెట్టుగా వ్యవహరించారు. కానీ చివరకు సోనియా గాంధీ అభ్యర్థనతో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు డీకే అంగీకరించారని సమాచారం.
తనకు పవర్ ఫుల్ పోర్ట్ ఫోలియోతో పాటుగా, పార్టీ చైర్మన్ పదవి ఇచ్చి తన సన్నిహితులకు 8 నుంచి 10 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని డీకే హైకమాండ్ దగ్గర కండీషన్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయాలను సిద్ధరామయ్య ఒక్కరే తీసుకోకుండా.. నిర్ణయం తీసుకునే ముందు తన అభిప్రాయాన్ని కూడా వినాలని, సీఎంతో పాటుగా తనకూ సరైన గౌరవం ఇవ్వాలని డీకే హైకమాండ్ ముందు డిమాండ్‌లు పెట్టినట్లుగా సమాచారం. ఈ డిమాండ్లకు కాంగ్రెస్ అధిష్టానం ఒకే అనడంతో డీకే శివకుమార్ సీఎం పదవిని త్యాగం చేశారని టాక్.
మరోవైపు కన్నడనాట మే 20వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. శనివారం రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డికే శివకుమార్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చీఫ్ గెస్టులుగా రానున్నారు. ఇక తెలంగాణ సీఎంతో పాటుగా వెస్ట్ బెంగాల్ , తమిళనాడు , జార్ఖండ్ , రాజస్థాన్ ఛత్తీస్‌గఢ్, బీహార్ , హిమాచల్ ప్రదేశ్ సీఎంలకు కర్ణాటక కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది.