ఈ 5 దేశాలకు మాత్రమే ఇరాన్ ఎందుకు అనుమతి ఇచ్చింది.. కారణాలు ఏంటీ..?

ఈ 5 దేశాలకు మాత్రమే ఇరాన్ ఎందుకు అనుమతి ఇచ్చింది.. కారణాలు ఏంటీ..?

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ.. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి 'హార్ముజ్ జలసంధి'ని ఇరాన్ తన గుప్పిట్లోకి తీసుకుంది. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కేవలం భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాక్ దేశాల.. ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లకు మాత్రమే ఈ మార్గం ద్వారా వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ ఐదు దేశాలకు మాత్రమే ఇరాన్ ఎందుకు మినహాయింపు ఇచ్చిందనే అంశంపై అంతర్జాతీయ విశ్లేషకులు ఆసక్తికర కారణాలను బయటపెడుతున్నారు.

చైనా, రష్యాలతో మిత్రబంధం:
ఇరాన్‌కు చైనా అతిపెద్ద ఆర్థిక వెన్నుముక. ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో దాదాపు 90 శాతం చైనానే కొనుగోలు చేస్తోంది. బదులుగా ఇరాన్ మార్కెట్ అంతా చైనా వస్తువులతో పాటు డిఫెన్స్ టెక్నాలజీని ఇరాన్ పొందుతోంది. ఇక రష్యా విషయానికొస్తే.. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు సాంకేతిక, ఆయుధ సహకారాన్ని అందిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా నిలవడంతో దానికి ప్రతీకారంగా రష్యా నౌకలకు ఇరాన్ పచ్చజెండా ఊపింది. ఈ రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇరాన్‌కు అండగా నిలుస్తున్నాయి.

భారత్ పాకిస్థాన్‌లతో అవసరాలు:
భారతదేశం నుంచి ఇరాన్‌కు అత్యవసర మందులు, ఇతర నిత్యావసరాలు ఎగుమతి చాలా కీలకం. యుద్ధ సమయంలో అంతర్గత కొరత రాకుండా ఉండేందుకు భారత్‌తో సత్సంబంధాలు ఇరాన్‌కు అవసరం. మరోవైపు పాకిస్థాన్ ఇక్కడ ఒక దౌత్యవేత్త పాత్రను పోషిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య తెరవెనుక చర్చలు జరపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. పొరుగు దేశం కావడంతో పాటు ఈ దౌత్యపరమైన అవసరాల దృష్ట్యా పాకిస్థాన్ నౌకలను ఇరాన్ అనుమతిస్తోందట.

ఇరాక్‌కి ప్రత్యేక పర్మిషన్ ఎందుకంటే..?
ఇరాక్.. ఇరాన్ దేశాల మధ్య షియా ముస్లిం జనాభా ప్రాబల్యంతో పాటు మతపరమైన అనుబంధం బలంగా ఉంది. ఇరాక్ ప్రభుత్వంలోని అనేక వర్గాలు ఇరాన్‌కు మిత్రపక్షాలుగా ఉన్నాయి. వీటికి తోడు ఇరాక్ తన విద్యుత్, నేచురల్ గ్యాస్ అవసరాల కోసం ఇప్పటికీ ఇరాన్‌పైనే ఆధారపడుతోంది. ఈ పరస్పర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా.. పొరుగున ఉన్న ఇరాక్‌తో కొత్త తలనొప్పులు కొనితెచ్చుకోకుండా ఇరాన్ ఈ మినహాయింపు ఇచ్చింది. మొత్తానికి తన శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల వాణిజ్యాన్ని దెబ్బతీస్తూనే.. తన ఆర్థిక, సైనిక, దౌత్య అవసరాలను తీర్చే 5 దేశాలను ఇరాన్ తన సేఫ్ జోన్ లో ఉంచుకుంది.