లక్ష్మీదేవి .. విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఎందుకు నివసిస్తుందో తెలుసా..

లక్ష్మీదేవి .. విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఎందుకు నివసిస్తుందో తెలుసా..

వీరిద్దరి ఆశీర్వాదాలు పొందితే అలాంటి వ్యక్తుల జీవితం ధన్యమవుతుంది. విష్ణువును విశ్వానికి రక్షకుడిగా పిలుస్తుంటారు. అయితే తల్లి లక్ష్మి సంపదకు దేవతగా నిలుస్తుంది. కానీ, వైకుంఠంలో, లక్ష్మి ఎల్లప్పుడూ శ్రీ హరి విష్ణువు పాదాల వైపు కూర్చుని, విష్ణువు పాదాలను నొక్కుతూ ఉంటుంది. భార్య... భర్త కాళ్లు ఎందుకు పట్టాలి.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి... లక్ష్మీ దేవత ఇలా ఎందుకు చేస్తుంది ? దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న  పౌరాణిక కథనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధునిక యుగం, హడావుడి జీవితం.. అందరూ యాంత్రికంగా మారిపోయారు. కాసుల వేటలో పడి కుటుంబ విలువలు, పద్ధతులు కొందరు పూర్తిగా మర్చిపోయినా ఇప్పటికీ వాటిని పాటించేవారు అక్కడక్కడా ఉన్నారు. వాటిలో ఒకటి భర్త కాళ్లు ఒత్తడం. ఇది ఆధిపత్యానికి నిదర్శనం అని అనుకుంటే పొరపాటే.... పూర్వ కాలంలో రోజూ ఉదయాన్నే భర్త కాళ్లకు భార్య దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది.  అయితే ఇప్పుడు ఎక్కడా అలాంటి ఆచారం కనపడటటం లేదనుకోండి... కాని అలా భర్త కాళ్లు భార్య నొక్కితే అంతులేని ఐశ్వర్వం కలుగుతుందని ఉపనిషత్తుల ద్వారా తెలుస్తోంది. 

పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఉంటే స్వామివారి పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. శేషతల్పంపై స్వామివారి ప్రతి ఫొటోలోనూ అమ్మవారు అయ్యవారి పాదాల దగ్గరే కూర్చుని కనిపిస్తుంది. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుంది... ఇంట్లో  ఆనందానికి, ఐశ్వర్యానికి సంబంధించి నిగూఢ అర్థం ఉందని చెబుతారు పండితులు..

మహాలక్ష్మైచ విద్మహే  
విష్ణుపత్న్యైచ ధీమహి 
తన్నోలక్ష్మీ ప్రచోదయాత్

హిందూ మతంలో లక్ష్మి దేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్న వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. అన్నింటా విజయం సిద్ధిస్తుంది. ఇక శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకోవాలంటే విశ్వమంతా ఉండేవాడే విష్ణువు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు. అంటే విశ్వానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు కాళ్ల దగ్గర సంపద అధిదేవతగా భావించే లక్ష్మీదేవి ఉంటుంది. 


ఓసారి నారదుడు...శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్లినప్పుడు...స్వామివారు నిద్రలో ఉన్నారని చూసి అక్కడే వేచి ఉండడం సముచితంగా భావిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి భర్త పాదాల దగ్గర కూర్చుని ఉండటాన్ని చూసి..ఆయన మనసులో  ప్రశ్న ఉదయించింది. అమ్మ ఎప్పుడూ శ్రీహరి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందని..తనలో తాను ఆగలేక ఈ ప్రశ్న లక్ష్మీదేవిని అడిగాడు. 

పురుషులకు కాళ్ళ వేలినుంచి మోకాళ్ళ వరకు ఉన్న భాగం శనిది .. స్త్రీల వేళ్ళ కొనలనుంచి అరచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది. భార్య..భర్త కాళ్లు పట్టడం ద్వారా శనిపై ....శుక్రుడి ప్రభావం పడి శని ప్రభావం తగ్గుతుంది. ఆ ఇల్లు సకల సంపదలకు నిలయగా మారుతుంది. అన్యోన్య దాంపత్యం,ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల  చెడు ప్రభావాలను నివారించడంతో పాటు, సంపద కూడా సిద్ధిస్తుంది. 

విష్ణుపురాణం 16 వ అధ్యాయంలో తెలిపిన పురాణకథనం  ప్రకారంగా

లక్ష్మీదేవి, విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురాణాలను చూసుకుంటే ఓ నాడు నారదమునీంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి ఇలాగడిగాడట. అమ్మ లక్ష్మీదేవి ఎందుకు నీవు నిరంతరం విష్ణువు పాదాల చెంత కూర్చుని పాదాలు నొక్కుతూ ఉంటావు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే గ్రహాల ప్రభావం మానవమాత్రులపైనే కాదు.. దేవతల మీదకూడా ఉంటుంది. ఎంతటి మహాదేవుడైనా గ్రహప్రభావం నుంచి తప్పించులేరు. రాక్షసగురువు శుక్రాచార్యుడు పురుషుల పాదాలలో ఉంటాడు. అలాగే దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తాడు. స్త్రీలు పురుషుని పాదాలను తాకడం వలన దేవుడికి, రాక్షసుడికి మధ్య కలయిక ఉంటుంది. అలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. దీంతో పాటు శుభం జరుగుతుందని లక్ష్మీ దేవి నారదమునీంద్రునికి సెలవిచ్చిందట. ఈ విషయాన్ని పలు పురాణాలలో తెలిపినట్టు పండితులు చెబుతున్నారు. అందుకే గృహిణులు తమ భర్తల పాదాలను తాకితే శుభం కలుగుతుందని చెప్తారు.

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం