
- పిటిషన్ దారుడిని ప్రశ్నించిన సుప్రీం
- వీధిలోని ఇరుగుపొరుగు వారిపై కోర్టుకెక్కిన నోయిడా వాసి
- కుక్కలకు తిండి పెట్టనివ్వట్లేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: వీధి కుక్కలపై అంత ప్రేమ ఉన్నపుడు వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి, ఇంట్లో వాటికి తినిపిస్తే మిమ్మలన్ని వద్దనేదెవరని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఈమేరకు ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషన్ దారుడికి ఈ ప్రశ్న సంధించింది. కుక్కలకు రోడ్లపై ఫుడ్ పెడితే మరి మనుషులు ఎక్కడ నడవాలని ప్రశ్నించింది. తమ కాలనీలోని వీధి కుక్కలకు రోడ్డుపై ఫుడ్ పెట్టడాన్ని స్థానికులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నోయిడాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..2023 యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) రూల్స్ ప్రకారం, వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు అనుమతి ఉన్నప్పటికీ నోయిడాలో అధికారులు, స్థానికులు వేధిస్తున్నారని ఆరోపించారు. నోయిడాలో ఫీడింగ్ జోన్లు లేకపోవడంతో రోడ్లపైనే కుక్కలకు ఫుడ్ పెడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనపై కోర్టు తీవ్రంగా స్పందించింది. " వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రతి రోడ్డును, గల్లీని ఖాళీగా ఉంచాలా? మరి మనుషులు ఎక్కడ తిరగాలి? రోడ్లపై ఫుడ్ పెడితే కుక్కలన్ని అక్కడే గుంపులుగా ఉండిపోతాయి.
దానికి బదులు మీ సొంత ఇంట్లోనే వీధి కుక్కలకు ఎందుకు ఫుడ్ పెట్టకూడదు? మీ ఇంట్లోనే కుక్కలకు ఫుడ్ పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? " అని కోర్టు నిలదీసింది. ప్రజలు ఎక్కువగా తిరగని చోట ఫీడింగ్ పాయింట్లను ఏర్పాటు చేయవచ్చని అడ్వకేట్ బదులివ్వగా..మీరెప్పుడైనా మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారా అని కోర్టు ప్రశ్నించింది. “రోడ్లపైనే ఫుడ్ పెట్టడం వల్ల కుక్కలు గుంపులుగా తిరుగుతాయి. ఇది సమస్యలను పెంచుతుంది. ఉదయం సైక్లింగ్ చేసి ఏం జరుగుతుందో చూడండి.
మార్నింగ్ వాకింగ్ చేసేవారిపై, టూ-వీలర్ రైడర్లు, పిల్లలు, వృద్ధులపై కుక్కలు దాడులు చేస్తుంటాయి. ఈ దాడుల్లో కొంత మంది ప్రాణాలుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి" అని కోర్టు తెలిపింది. 2021 ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం..జంతువులకు ఆహారం ఇవ్వడం హక్కేనని.. అయితే, అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని వెల్లడించింది.
ఈ పిటిషన్ ను ఇలాంటి సమస్యలపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మరో పిటిషన్ కు జతచేసింది. దీనిపై ఇప్పుడే ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.