ఉద్యోగాలివ్వని ఈ సర్కారు ఎందుకు?

ఉద్యోగాలివ్వని ఈ సర్కారు ఎందుకు?

యూత్​ను​ హమాలీ పని చేసుకోవాలంటరా?:  షర్మిల ఫైర్​
దేవరకొండ, వెలుగు: నిరుద్యోగ తెలంగాణ యువతను హమాలీ పని చేసుకొని బతకండని మంత్రులతో చెప్పిస్తున్న కేసీఆర్​ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్​షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకొచ్చి ఏడేండ్లయినా ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దాంతో నిరుద్యోగులు విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల ప్రజాప్రస్ధానం పాదయాత్ర సోమవారం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్​నుంచి పోలేపల్లి, ఎర్రమట్టి తండా, బోటిమీది తండా, పాలెం తండా, చావ్లా తండా, చాకలి శేరిపల్లి, ఉమ్మాపురం క్రాస్​రోడ్, గొల్లపల్లి, సమైఖ్యనగర్​మీదుగా కుర్మేడు గేటు దాకా సాగింది. దారి పొడవునా ప్రజలు ఆమె పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతులు, మహిళలను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారామె. గొల్లపల్లిలో వైఎస్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  గ్రామస్తులతో మాట ముచ్చట జరిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు సరిగా అందుతున్నాయా అని అడిగారు. అందడం లేదని, ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయిందని ఇద్దరు వృద్దులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ తెచ్చిన ఆరోగ్య శ్రీ పథకం కింద గుండె ఆపరేషన్ చేయించుకుని బతికానని గొల్లపల్లికి చెందిన ఓ యువకుడు చెప్పాడు. ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం కింద ఇద్దరు పిల్లలను ఇంజనీరింగ్​చదివిస్తున్నానని మరో మైనార్టీ వ్యక్తి చెప్పారు.
2 లక్షల ఉద్యోగాలెవ్వి?
తెలంగాణలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానన్న హామీని కేసీఆర్ ఇప్పటికీ అమలు చేయలేదని షర్మిల మండిపడ్డారు. ‘‘తన ఇంట్లో వాళ్లందరికీ రాజకీయ ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్​ నిరుద్యోగ యువత గురించి ఆలోచించక పోవడం దారుణం. ప్రజల సమస్యలను తీర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన వైఫల్యం వల్లే కృష్ణా జలాల వాడకంలో ఇబ్బందులొస్తున్నాయి. ఇలాంటి సీఎంకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. ప్రజల మనసులో నిలిచిపోయిన వైఎస్​బిడ్డగా తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తా. అందుకే పార్టీ పెట్టా. మాట తప్ప, మడమ తిప్ప అన్న వైఎస్ మాటలే స్ఫూర్తిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తా” అన్నారు.
--------