
2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు జట్టు కట్టాయి. 26 అపొజిషన్ పార్టీలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. తమది ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయెన్స్ (ఐఎన్‌డీఐఏ-– ఇండియా)’ అని ప్రకటించాయి. మంగళవారం కర్నాటకలోని బెంగళూరులో నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా కూటమి పేరును ప్రకటించారు.
అయితే ఈ పేరునే బీహార్ సీఎం నీతీశ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇతర పార్టీల నేతలు ఆయనకు సర్ధి చెప్పడంతో చివరకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. ప్రతిపక్షాల కూటమికి INDIA అనే పేరు ఎలా పెడతారు? పైగా ఇందులో బీజేపీకి చెందిన NDA కూటమి అక్షరాలున్నాయని నీతీశ్ కుమార్ కుమార్ ప్రశ్నించారట. ఇండియా మెయిన్ ఫ్రంట్ లేదా ఇండియా మెయిన్ అలయన్స్ వంటి పేర్లను సూచించారట. కానీ అత్యధిక పార్టీలు INDIA అనే పేరుకు ఆమోదం తెలపడంతో ఫైనల్ గా నీతీశ్ కూడా దానికే ఒకే చెప్పారట.
విపక్షాల కూటమికి ‘ఇండియా’ పేరును కాంగ్రెస్ లీడర్ రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారని కొందరు నేతలు వెల్లడించారు. అయితే తొలుత ఇందులోని డి అనే అక్షరానికి డెమోక్రటిక్ (ప్రజాతంత్ర) అని ప్రతిపాదించారు. ఎన్డీయేలో డి అక్షరానికి అదే అర్థం ఉన్నందువల్ల దీనిని డెవలప్‌మెంటల్‌గా మారుద్దామని కొందరు నేతలు సవరించారట. నేషనల్ అనే పదాన్ని తీసేద్దామని కూడా ఒక దశలో అనుకున్నా చివరకు దానిని ఉంచాలనే నిర్ణయించారట.. అలా చివరకు విపక్షాల కూటమికి ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డీఐఏ- ఇండియా)’ పేరును ఖరారు చేశారట.
తమ కూటమికి ఇండియా అనిపేరు పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు దానికి ట్యాగ్‌లైన్‌గా ‘జీతేగా భారత్’( భారతదేశం గెలుస్తుంది)ఎంచుకున్నాయి. కూటమి ట్యాగ్‌లైన్ హిందీలో ఉండాలని ఉద్దవ్ ఠాక్రే సూచించారని తెలుస్తోంది. హిందీ భాషతోపాటు అన్ని భాషల్లో ఈ ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తామని వెల్లడించాయి. అయితే దీన్ని నడిపించేది ఎవరు? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ముంబైలో మరోసారి సమావేశమవుతామని, 11 మందితో కమిటీని ఏర్పాటు చేస్తామని, కూటమికి కన్వీనర్‌ను ప్రకటిస్తామని ఖర్గే వెల్లడించారు.