ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ కోరట్లేదేం! : సీఎం రేవంత్ ఫైర్

ఫోన్ ట్యాపింగ్ పై  సీబీఐ విచారణ కోరట్లేదేం! : సీఎం రేవంత్ ఫైర్

ఢిల్లీ : అన్నింటికీ సీబీఐ విచారణ చేయించాలని కోరే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాత్రం కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయబోదని, అలాంటి వెధవ పనులు తాము చేయబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తుగ్లక్ రోడ్ 23 లో సీఎం అధికారిక నివాసం నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. కనపడకుండా పోయిన హార్డ్ డిస్క్ లు,ధ్వంసం అయిన డేటా బాక్ అప్ డేటా ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాల్సి ఉందన్నారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చునని, గత ప్రభుత్వం దానిని దుర్వినియోగం చేసిందని చెప్పారు.

 తెలంగాణలో పారదర్శకంగా పాలన సాగుతోందని అన్నారు. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యతను అందెశ్రీకే అప్పగించామని, సంగీతం సమకూర్చడం వ్యవహారాన్ని కూడా ఆయనే చూసుకుంటున్నారని చెప్పారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తన పనికాదని అన్నారు. అందె శ్రీ ఎవరితో గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని చెప్పారు. తెలంగాణ చిహ్నం రూపకల్పన  నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామని అన్నారు. 

తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు అని సీఎం అన్నారు. వాటిని స్ఫురణకు తెచ్చేలా చిహ్నం రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాళేశ్వరం కరెంటు బిల్లులన్నీ సముద్రంలోకి వదిలిన  నీళ్లలాంటివని,  52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని అన్నారు. సముద్రంలోకి వెళ్లిన నీళ్లకూ కరెంటు బిల్లులు కట్టామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య పై నిపుణుల సూచనలతో ముందుకు వెళతామని వెల్లడించారు.