చిన్న పిల్లలకు ఇంతేసి పని చెప్తరా?

చిన్న పిల్లలకు ఇంతేసి పని చెప్తరా?
  • చిన్న పిల్లలకు ఇంతేసి పని చెప్తరా?
  • ఆన్​లైన్​ క్లాసులపై ప్రధాని మోడీకి ఆరేండ్ల పాప కంప్లైంట్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూతపడ్డయ్.. స్టూడెంట్లు ఇండ్లకే పరిమితం కాగా, టీచర్లు ఆన్​లైన్​లో పాఠాలు చెబుతున్నారు. ఈ ఆన్​లైన్​ చదువులతో చాలామంది స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్​ఫోన్​ లేక కొందరు.. ఇంటర్నెట్​ సిగ్నల్​ దొరకక ఇంకొందరు, రెండూ ఉన్నా గంటల తరబడి క్లాసులు వినలేక మరికొందరు అనారోగ్యం పాలైతున్నరు. ఆన్​లైన్​ క్లాసుల వల్ల తాను ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకంగా ప్రధానికే కంప్లైంట్​ చేసిందో ఆరేండ్ల చిన్నారి. దీన్నంతా ఓ జర్నలిస్టు  వీడియో తీసి ట్విట్టర్​లో పెట్టడంతో వైరల్​గా మారింది. ఒక్క రోజులో 57 వేల మంది ఈ వీడియోను చూడగా.. 5 వేల మంది లైక్​ చేసిన్రు. ఈ విషయంపైన సీరియస్​గా దృష్టిపెట్టాల్సిందేనని చాలామంది రీట్వీట్​ చేసిన్రు. పిల్లలకు ఆన్​లైన్​ క్లాసుల బెడదను తప్పించాలని కోరిన్రు.

వీడియోలో చిన్నారి మాటలు..
కాశ్మీర్​కు చెందిన ఆరేండ్ల చిన్నారి ఆన్​లైన్​ క్లాసులపై ఓ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీకి కంప్లైంట్​ చేసింది. ‘పదింటి నుంచి మధ్యాహ్నం రెండింటి దాకా ఇంగ్లిష్, మ్యాథ్స్, ఉర్దూ, ఈవీఎస్ ఆన్​లైన్​ క్లాసులు వినాలె. ఆ తర్వాత కంప్యూటర్​ క్లాసు కూడా ఉంటుంది. అదికూడా అయిపోతే స్కూల్​ వర్క్​ ( చేతులతో చూపిస్తూ) చాలా ఉంటుంది. నాలాంటి చిన్న పిల్లలకు రోజూ ఇంతేసి వర్క్​ చెప్పడమేంటి మోడీ సాబ్? అయినా ఏం చేయగలం! అస్సలామాలేకుం మోడీ సాబ్. బై’  అని వీడియోలో చెప్పింది.