
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వితంతు పెన్షన్ల పథకం నేడు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారింది. ఓ వృద్దురాలిని బ్రతికుండగానే చనిపోయినట్టు నిర్ధారించిన సంఘటన శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆరేండ్ల క్రితం బిర్ల మనెమ్మ భర్త చనిపోయాడు. ఆమె అప్పటినుంచి వితంతు పెన్షన్‌కు తీసుకోకపోవడంతో మనెమ్మా కూడా మృతి చెందినట్లు అధికారులు రికార్డులో నమోదు చేశారు. అయితే తాను బ్రతికే ఉన్నానని తనకు పెన్షన్ ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఊరిలో గ్రామసభ జరుగుతుండగా.. మనెమ్మ కిరోసిన్ డబ్బాతో వెళ్లి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.