
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఘటన
- పరారీలో నిందితులు.. అందరిదీ బిహార్
చేవెళ్ల, వెలుగు: ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో జరిగింది. అజీజ్‌నగర్‌కు చెందిన సామ రాజిరెడ్డి రెండు నెలల కింద డెయిరీ ఫామ్ ప్రారంభించాడు. అందులో పని చేసేందుకు ఓ జంట కావాలని బిహార్‌కు చెందిన ఏజెంట్ పవన్‌ను సంప్రదించాడు. అతని ద్వారా నెల కింద రాజేశ్ కుమార్, పూనందేవి దంపతులను పనికి కుదుర్చుకున్నాడు. గత గురువారం రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌కు వెళ్లగా రాజేశ్ కుమార్ దంపతులతో పాటు మరో వ్యక్తి కనిపించాడు.
అతను తమ బంధువని వాళ్లు చెప్పడంతో ఆయన సరేనని ఊరుకున్నాడు. మళ్లీ శుక్రవారం ఫామ్‌కు వెళ్లిన రాజిరెడ్డికి రాజేశ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడని పూనందేవిని అడగ్గా.. ‘మద్యం తాగి వచ్చి, నాతో గొడవ పడి ఎక్కడికో వెళ్లాడు’ అని చెప్పింది. అదేరోజు సాయంత్రం ఫామ్ వద్దకు వెళ్లిన రాజిరెడ్డికి పని వాళ్లెవరూ కనిపించలేదు.
ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో శనివారం ఏజెంట్ పవన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి ఫోన్ చేసి.. ‘పూనందేవి, మహేశ్అలియాస్ గుడ్డూ కలిసి రాజేశ్‌ను చంపి, బావి వద్ద పడేశారు’ అని చెప్పాడు. రాజిరెడ్డి వెళ్లి చూడగా రాజేశ్ కుమార్ డెడ్‌బాడీ కనిపించింది. పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. రాయితో ముఖం, తలపై కొట్టి చంపినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.